బీసీల కోటాపై టీడీపీ ఆట

6 Mar, 2020 03:55 IST|Sakshi

స్థానిక ఎన్నికల వాయిదాకు విపక్షం కుట్రలు

రూ.5,100 కోట్ల కేంద్ర నిధులను అడ్డుకునే ఎత్తుగడ

బీసీలకు 22 శాతంతోనే తెలంగాణలో స్థానిక ఎన్నికలు

రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీం

బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధితో 59.85 శాతం రిజర్వేషన్లతో జీవో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

మళ్లీ ఇప్పుడు సుప్రీంను ఆశ్రయించి ఎన్నికల వాయిదాకు టీడీపీ యత్నాలు  

సాక్షి, అమరావతి: బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందనే వాదనకు బలం చేకూర్చేలా న్యాయ వివాదాలకు పురిగొల్పుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా విపక్షం కుట్రపూరితంగానే బీసీ రిజర్వేషన్లపై వివాదం రాజేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ఆటంకాలు కల్పించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల కోట్లకుపైగా నిధులను అడ్డుకునే దుర్బుద్ధి దీని వెనక దాగుందని పేర్కొంటున్నారు. 

అన్ని రాష్ట్రాలు తగ్గిస్తున్నా.. ధైర్యంగా ముందుకే జగన్‌
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఇచ్చే రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశంలో 24 రాష్ట్రాలు ఒక్కొక్కటిగా బీసీలకిచ్చే రిజర్వేషన్లను 16–25 శాతం వరకు తగ్గించుకున్నాయి. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. అయినప్పటికీ ఆ తర్వాత 2019 డిసెంబరులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా ముందుకెళ్లి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్‌లో ఆమోదించి జీవో కూడా జారీ చేసింది. ఆ జీవో మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు కూడా ఆమోదం తెలిపింది.

అయితే టీడీపీ నేతలు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85%రిజర్వేషన్ల జీవోతో ఎన్నికలు జరపడంపై స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనతో తిరిగి దీనిపై హైకోర్టులో విచారణ జరగడంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తీర్పు వెలువడింది. 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు మొదట రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపిన తర్వాత టీడీపీ నేత సుప్రీంకోర్టులో కేసు వేయకుంటే బీసీలకు 34 శాతంతోనే ఎన్నికలు జరిగేవని పేర్కొంటున్నారు.

ఎన్నికలు, నిధులను అడ్డుకోవడమే విపక్షం ధ్యేయం
రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు గ్రామ పంచాయతీలకు తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకాగా టీడీపీ హయాంలో నామినేటెడ్‌ పదవి పొందిన ఆ పార్టీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి సుప్రీంకోర్టు, హైకోర్టులలో వరుసగా కేసులు వేయడంతో వాయిదా పడుతూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.5,100 కోట్ల నిధులను అడ్డుకోవడమే టీడీపీ ధ్యేయమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పార్లమెంట్‌లో చట్టమే మార్గం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై వివాదాలకు రాజ్యాంగ బద్ధతే శాశ్వత పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. పార్లమెంట్‌లో చేసిన చట్టం కారణంగా తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం గతంలోనే కేంద్రంపై ఒత్తిడి తేవడంతో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్‌లో చేర్చారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం జగన్‌ సూచన మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు గతేడాది మార్చిలో పార్లమెంట్‌లో బిల్లు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఇప్పుడు సుప్రీంకు వెళితే ప్రయోజనమా?
బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలైన కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రముఖ బీసీ ఉద్యమ నాయకుడు సిద్ధరామయ్య హయాంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. బీసీ నేతలైన బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం చౌహాన్‌ కూడా 2013–2014లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 – 22 శాతం తగ్గించారని గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబు వాదనలో  పసలేదు
సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు, ఉపయోగం లేదు. గత ప్రభుత్వాలు చాలాసార్లు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశాయి. ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు చెప్పింది. అలాంటప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళితే ఆ తీర్పు పునరావృతం అవుతుంది. చంద్రబాబు చర్యలతో కాలయాపన తప్ప బీసీలకు ఒరిగేదేమీ ఉండదు’ – ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో టీడీపీ పిటిషన్‌
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. 

మరిన్ని వార్తలు