అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎంపీలు 

9 Apr, 2018 01:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన పేరుతో టీడీపీ ఆడుతున్న నాటకం మరోసారి బట్టబయలైంది. ఆదివారం ప్రధాని మోదీ ఇంటి ముందు మెరుపు ఆందో ళన పేరుతో ఆ పార్టీ ఎంపీలు చేపట్టిన ధర్నా మరో నాటకమని తేలిపోయింది. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆదివారం ఢిల్లీ రావడంతో ప్రజల దృష్టి మళ్లించడానికే టీడీపీ ఎంపీలు ఈ ధర్నా డ్రామా ఆడారు. ఆదివారం ఉదయం ప్రెస్‌మీట్‌ ఉందని చెప్పిన టీడీపీ ఎంపీలు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్నామంటూ బయలుదేరారు.

ఇంటి ముందు ధర్నాకు దిగితే ఎక్కడ మోదీ ఆగ్రహించి చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపిస్తారేమో అన్న భయంతో.. ఇటు ధర్నా చేసినట్టు, అటు మోదీ ఆగ్రహానికీ గురికాకుండా ఉండేందుకు వీలుగా ప్రణాళిక రచించారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి ధర్నాకు బయలుదేరారు. దీంతో పోలీసులు ప్రధాని నివాసానికి కిలోమీటరు దూరంలోనే రహదారులను బ్లాక్‌ చేసి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న టీడీపీ ఎంపీలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు అప్పటికే సిద్ధం చేసిన బస్సులో వారిని తుగ్లక్‌ రోడ్డు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ తతంగం మొత్తం ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు జరగలేదు. స్టేషన్‌కు చేరుకున్న టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు కలసిపోయాయని ప్రతి ఎంపీ పదేపదే చెబుతూ బురదజల్లే ప్రయత్నం చేశారు. స్టేషన్‌లో ఉన్న టీడీపీ ఎంపీలను ఢిల్లీ సీఎం అరవింద్‌  కేజ్రీవాల్‌ పరామర్శించారు. అనంతరం పోలీసులు టీడీపీ ఎంపీలను విడిచిపెట్టారు.   

మరిన్ని వార్తలు