ఏయూ సొంత జాగీరా

21 May, 2018 12:33 IST|Sakshi
సభావేదిక

గతేడాది అనుమతుల్లేకుండా మహానాడు నిర్వహణ

ఇప్పుడు ధర్మపోరాట సభ పేరిట పార్టీ కార్యక్రమం

ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సహా ఇతర పార్టీల కార్యక్రమాలకు అనుమతుల నిరాకరణ

కనీసం విద్యార్థుల దీక్షలకు కూడా అనుమతించని వైనం  ‘దేశం’ నేతలకు దాసోహమంటున్నఏయూ వర్గాలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)ను తెలుగుదేశం పార్టీ నేతలు సొంత జాగీరులా మార్చేస్తున్నా పాలకమండలి సభ్యులు గానీ, అధికారులు గానీ కిమ్మనకపోవడం వివాదాస్పదమవుతోంది. పైగా టీడీపీ నేతలకు వంతపాడుతూ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలపాలవుతోంది. సరిగ్గా గతేడాది మే నెలలోనే ఏయూ గ్రౌండ్స్‌లో ఎటువంటి అనుమతుల్లేకుండా టీడీపీ మహానాడు నిర్వహించిన పార్టీ పెద్దలు మంగళవారం ధర్మపోరాట సభ పేరిట రాజకీయ కార్యక్రమం నిర్వహించడం చర్చాంశనీయమవుతోంది. వర్సిటీలో రాజకీయ పార్టీల సభలు ఏర్పాటు చేయడమే నిబంధలకు విరుద్ధం కాగా.. ఆ సభకు కనీసంగా అనుమతులు తీసుకోకపోవడం టీడీపీ నేతల లెక్కలేని తనానికి అద్దం పడుతోంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఏటా మే నెలాఖరులో నిర్వహించే మహానాడును గతేడాది ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏయూలో నిర్వహించడమే వివాదాస్పదమైతే... అసలు  ఏయూ అధికారుల నుంచి నిర్వహణకు కనీస అనుమతులు కూడా పొందని టీడీపీ నేతల బరితెగింపు వ్యవహారంపై అప్పట్లో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా జాగ్రత్తగా ఉండాల్సిన ఏయూ అధికారులు ఈ సారి స్వయంగా వారే దాసోహం అన్నారు. దీంతో టీడీపీ ప్రత్యేక హోదాపై ‘అర్ధంతరపు’ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం తలపెట్టిన ధర్మపోరాట సభకు వర్సిటీ అధికారులే అనుమతిలిచ్చేశారు. టీడీపీ నాయకులు మాట వరుసకు వచ్చి కలిస్తే... అయ్యో ఫరవాలేదండీ... మీ ఇష్టం వచ్చినట్టు గ్రౌండ్స్‌ను వాడుకోండి... అంటూ సొంతజాగీరులా అప్పజెప్పేశారు.

ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మాత్రం నో
తెలుగుదేశం పార్టీకి వంతపాడుతూ ఏయూ గ్రౌండ్స్‌లో సభకు అనుమతిలిచ్చేసిన అధికారులు ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభలకు మాత్రం ఎప్పటికప్పుడు మోకాలడ్డుతూ వస్తున్నారు. 2015 సెప్టెంబర్‌లో ప్రత్యేక హోదా డిమాండ్‌తోనే యువభేరి పేరిట విద్యార్థులు, యువకులతో వర్సిటీ గ్రౌండ్స్‌లో సదస్సు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నేతలు భావించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో రాజకీయ సమావేశాలు, మత సంబంధమైన కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని ఉన్నత విద్యామండలి జీవో జారీ చేసిందంటూ అప్పట్లో వర్సిటీ అధికారులు హడావుడి చేశారు. అనుమతిలివ్వలేమని చేతులెత్తేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు యువభేరిని పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించుకున్నారు. ఆ తర్వాత 2016 నవంబర్‌లో జై ఆంధ్రప్రదేశ్‌ పేరిట బహిరంగసభను నిర్వహించేందుకు ఏయూ గ్రౌండ్స్‌ను అడిగితే అప్పు డూ అదే సాకు చెప్పారు. దీంతో వన్‌టౌన్‌ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించారు.

విద్యార్థుల దీక్షలకూ నిరాకరణ
ఇక ప్రత్యేక హోదా డిమాండ్‌తోనే వర్సిటీలో విద్యార్థులు దీక్షలు తలపెడితే కనీస మానవత్వం లేకుం డా వర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపా రు. గత ఏప్రిల్‌లో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో చేపట్టిన నిరవధిక దీక్షలకు సంఘీభావంగా ఏయూలో విద్యార్థి సంఘాల నేతలు నిరవధిక నిరశన దీక్షలకు దిగారు. ఆ మేరకు కనీసం టెంట్‌ వేసుకునేందుకు కూడా వర్సిటీ అధికారులు అనుమతివ్వలేదు. వేసిన టెం ట్లు కూడా నిర్దాక్షిణ్యంగా తీసివేయడంతో విద్యార్థి నేతలు మండుటెండలోనే దీక్షలు కొనసాగించారు.

టీడీపీ సభకు మాత్రం సై...
వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులపై ఇలా లెక్కలేనన్ని ఆంక్షలు పెట్టిన ఏయూ అధికారులు అధికార టీడీపీ నేతలు వచ్చి సభ పెట్టు కుంటామంటే ఏ మాత్రం ఆలోచించకుండా అనుమతులిచ్చేశారు. పోనీ గ్రౌండ్‌ వరకే  పర్మిషన్‌ ఇచ్చారని భావించినా.. వర్సిటీలో రోడ్ల మధ్యలో ఇష్టారాజ్యంగా గోతులు తీసి స్వాగత ద్వారాలు, కటౌట్లు పెట్టేస్తున్నా వర్సిటీ అధికారులు మిన్నకుం డటం విమర్శలపాలవుతోంది. వాస్తవానికి అధికా రుల్లోని ఓ వర్గం మాత్రం టీడీపీ నేతల బరితెగింపుపై విస్మయం వ్యక్తం చేస్తున్నా బహిరంగంగా మాట్లాడేందుకు మాత్రం సాహసం  చేయడం లేదు. ఇక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏయూపై అధికార టీడీపీ పెత్తనం చేస్తున్నా విద్యార్థి సంఘాలు సైతం మౌనంగా ఉండటం చర్చాంశనీయంగా మారింది.

ఏయూ అధికారులు టీడీపీ తొత్తుల్లా మారారు... వంశీకృష్ణ విమర్శ
ఏయూ ఉన్నతాధికారులు టీడీపీ నేతలకు తొత్తుల్లా మారారని వైఎస్సార్‌ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. గతంలో తాము ఎన్నోమార్లు ప్రత్యేక హోదా ఉద్యమ సభలకు, సదస్సులకు ఏయూ గ్రౌండ్స్‌ను అడిగితే అనుమతులు నిరాకరించిన అధికారులు టీడీపీ నేతలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తున్నారని విమర్శించారు. అధికారమదంతో ఏయూను సొంత జాగీరులా వాడుకుంటున్న టీడీపీ నేతలకు విద్యార్థులు గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు.

అనుమతిచ్చాం.. అద్దెకట్టారో లేదో తెలియదు: వీసీ నాగేశ్వరరావు
టీడీపీ అర్బన్‌ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ వచ్చి అనుమతి కావాలని అడిగారు.. సెలవులే కదా అని వర్సిటీ గ్రౌండ్స్‌ను అద్దెకిచ్చాం.. రోజుకు లక్ష వరకు అద్దె చెల్లించాలి.. మరి ఆ డబ్బులు కట్టారో లేదో నాకు తెలియదు... అని ఏయూ వీసీ ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు సాక్షి ప్రతినిధితో అన్నారు. ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ సహా ఇతర పార్టీల సభలు, సదస్సులకు అనుమతులు ఇవ్వని మీరు... టీడీపీ సభలకు మాత్రమే ఎలా ఇస్తున్నారని ప్రశ్నించగా... అప్పుడు సెలవుల్లేవు.. ఇప్పుడు సెలవులు కదా.. అందుకే ఇచ్చామని చెప్పుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ నేతలు సెలవుల రోజుల్లో అడిగినా పర్మిషన్‌ ఇవ్వలేదని ప్రస్తావించగా.. ఏమో ఆ తేదీలు గుర్తు లేవు అని  సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు