ఓడిపోతే అంతుచూస్తా?

11 Apr, 2019 08:49 IST|Sakshi
గ్రామస్తులను సెల్‌లో ఫొటో తీస్తున్న పోలీస్‌

సాక్షి,రాప్తాడు: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం ఐదు గంటలకే ముగిసినా టీడీపీ రాప్తాడు అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ తన అనుచరులతో రాత్రి 11 గంటలైనా పోలీసుల సమక్షంలోనే రాప్తాడు మండలం పాలవాయి, పాలవాయి తండా, ఎం.చెర్లోపల్లి, మరూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ స్థానికులు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఎం.చెర్లోపల్లిలో శ్రీరామ్‌కు చుక్కెదరైంది. ఈ సమయంలో ప్రచారం ఏమిటంటూ స్థానికులు ఎదురు తిరగడంతో ఈ ఎన్నికల్లో ఓడిస్తే మీ అంతు చూస్తానని బెదిరించినట్లు సమాచారం. రానున్నది టీడీపీప్రభుత్వమేనంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు.  

ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తాడని, మంత్రి అయిన వెంటనే ఆరు మండలాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను గ్రామాల్లోంచి బయట గెంటివేస్తామని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా, ప్రచారం ముగిసినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలకు జెండాలు కట్టుకొని, డ్రమ్స్‌ వాయిస్తూ బాణాసంచ పేలుస్తూ గ్రామాల్లో హంగామా సృష్టించారు. టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ఉన్నా నోరు మెదపలేదు. వారికి ముడుపులు అందడంతోనే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

వైఎస్సార్‌సీపీ నాయకులకు పోలీసుల బెదిరింపులు 
గ్రామంలో రాత్రి పది గంటల సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ ప్రచారం నిర్వహిస్తున్నాడని ఆయన కాన్వాయ్‌లో ఉన్న ఇటుకలపల్లి సీఐ మధు, ఎస్‌ఐ గంగాధర్‌కు ఎం.చెర్లోపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నాయకులను ప్రచారం చేయకుండా గ్రామం నుంచి బయటకు పంపాలి. పోలీసులు అలా చేయకుండా మీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా ప్రచారం నిర్వహించుకోవచ్చని, మీరు ఇప్పుడు అడ్డు పడితే అరెస్ట్‌ చేస్తామని బెదిరించారు. అరెస్ట్‌ చేస్తే భయపడబోమని వైఎస్సార్‌సీపీ నాయ కులతో పాటు గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ‘ఎన్నికలు అయిపోగానే మీ కథ చూస్తామం’టూ గ్రామస్తుల ఫొటోలను సెల్‌ఫోన్‌లో తీసుకున్నారు. ఎట్టకేలకు అక్కడ భారీ జనాలు గూమికూడడంతో పరిటాల శ్రీరామ్‌ అక్కడి నుంచి మరూరుకు వెళ్లిపోయారు. మరూరులో కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డు తగలడంతో చేసేదేమీ లేక పరిటాల శ్రీరామ్‌ వెనుదిరిగిపోయారు.   

>
మరిన్ని వార్తలు