టీడీపీకి మరోషాక్‌.. సీనియర్‌ నేత రాజీనామా!

9 Jul, 2019 16:30 IST|Sakshi

టీడీపీ అధికార ప్రతినిధి పదవికి చందు సాంబశివరావు రాజీనామా

త్వరలో బీజేపీలో చేరే అవకాశం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి ఫలితాల అనంతరం ఊహించని పరిణామాలు ఎదురువుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి.. బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు టీడీపీని వీడనున్నారు. పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అయితే త్వరలోనే బీజేపీలో చేరుతారని ఆయన అత్యంత సన్నిహితుల సమాచారం.

గుంటూరు జిల్లాలో అత్యంత సీనియర్‌ నేతగా పేరొందిన సాంబశివరావు.. గతకొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో.. పార్టీకీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ జెండా మోసిన అనుభవం సాంబశివరావుకుంది. 2004లో గుంటూరు జిల్లా దుగ్గిరాల నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీచేశారు. సాంబశివరావు ఉన్నత విద్యను అభ్యసించి నాసా, ఇస్రోలలో శాస్త్రవేత్తగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో వివిధ అంతర్జాతీయ సంస్థల్లో ఐటీ విభాగంలో విశేష సేవలు కూడా అందించారు. అయితే తనకు పార్టీలో సరైన ప్రాతినిథ్యం లభించలేదని.. ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారని సన్నిహితుల సమాచారం. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు