టీడీపీలో సోషల్‌ మీడియా వార్‌​​​​​​​

16 Jun, 2019 09:07 IST|Sakshi
ఫేస్‌బుక్‌లో హల్‌చల్‌ చేస్తున్న టీడీపీ నాయకుల ఓటింగ్‌

ఓటింగ్‌....ఫైటింగ్‌...

తెలుగు తముళ్లలో రగులుతున్న విభేదాలు 

కుప్పం: చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సోషల్‌ మీడియా చిచ్చు రాజేస్తోంది. ఫేస్‌బుక్‌ పోస్టులు టీడీపీ నేతల మధ్య మరింత విభేదాలకు దారితీస్తున్నాయి. వర్గ విభేదాలను బట్టబయలు చేస్తున్నాయి. ఏ పదవికి ఎవరు అర్హులంటూ కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో ఆన్‌లైన్‌ పోలింగ్‌ పోస్టులు చేస్తున్నారు. దీంతో ప్రభావం ఆయా నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేధాలకు దారితీస్తోంది. 

పోలింగ్‌ పోస్ట్‌లతో హల్‌..చల్‌..
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలోని వివిధ పోస్టులకు ఎవరు అర్హులో అభిప్రాయాలు తెలపాలంటూ ఫేస్‌బుక్‌లో ఓటింగ్‌ పెడుతున్నారు. కుప్పం యువౖసే పేరిట టీడీపీ నేతల పేర్లతో పాటు ఫొటోలను షేర్‌ చేస్తూ ఆన్‌లైన్‌ ఓటింగ్‌ జరుగుతోంది. కుప్పం ఎంపీపీ, జెడ్పీటీసీ, టౌన్‌బ్యాంకు చైర్మన్‌తో పాటు వివిధ పదవులకు కొందరి అభ్యర్థుల ఫొటోలతో ఓటింగ్‌ పెట్టారు. ఇందులో తమ నాయకుడే గెలుస్తాంటే, కాదు మా నేతే గెలుస్తారంటూ గ్రూపులుగా విడిపోయారు. గత వారం రోజులుగా ఎంపీపీ అభ్యర్థులుగా మాజీ ఎంపీపీ వెంకటేష్, కమతమూరు సర్పంచ్‌ ప్రతాప్‌ ఇరువురికి ఓటింగ్‌ చేయాలని పోస్ట్‌ చేశారు. దీంతో పాటు జెడ్పీటీసీ, టౌన్‌ బ్యాంకు చైర్మన్‌ పదవులకు టీడీపీ అభ్యర్థులను ఇద్దరిని ఎంపిక చేసుకుని ఓటింగ్‌ కోరుతున్నారు. ఇది కాస్తా ఆ పార్టీలో అగ్గిరాజేసింది. అది కాస్తా ఇప్పుడు పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

భగ్గుమంటున్న విభేధాలు
ఫేస్‌బుక్‌లో ఓటింగ్‌లో పాల్గొన్న అభ్యర్థుల్లో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఎవరు ఏ అభ్యర్థికి ఓటు వేశారన్నది ఫేస్‌బుక్‌లో తెలుస్తుంది. దీన్ని గమనించిన పోటీపడుతున్న అభ్యర్థులు వారికి ఫోన్లు చేసి బెదిరింపులు చేపడుతున్నారు. కుప్పం యువసైన్యం అకౌంట్‌లో ఎవరు ఇలాంటి పోస్టింగులు చేస్తున్నారన్నది స్పష్టత లేకపోవడంతో టీడీపీలో విభేధాలు చోటుచేసుకుంటున్నాయి. ఓటింగ్‌ శాతం తక్కువగా వస్తే స్నేహితుల ద్వారా ఓటింగ్‌ చేయాలని కొందరు నాయకులు ప్రచారాలు సైతం చేపడుతున్నారు. ఇప్పటికే ఓడిపోయిన ఓటమితో ఉన్న టీడీపీ నేతలు సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులు అభ్యర్థుల మధ్య విభేదాలను తారా స్థాయికి చేర్చుతున్నాయి.  

పట్టణంలో హాట్‌ టాపిక్‌..
నియోజకవర్గంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వస్తున్న స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఓటింగ్‌ పట్ల పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరు ఫేస్‌బుక్‌లో తమకు ఓట్లు వేయలేదో తెలుసుకుని వారికి ఫోన్ల ద్వారా బెదిరింపులు చేపడుతుంటంతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌దారులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ఓటింగ్‌ సైతం తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోందని పలువురు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు