కోడెల వ్యవహారంపై టీడీపీ మౌనం

19 Jun, 2019 10:16 IST|Sakshi
కోడెల శివప్రసాదరావు (ఫైల్‌)

ఆయన్ను వెనకేసుకొస్తే పరువు పోతుందని సీనియర్ల సూచన

అందుకే డీజీపీకి ఫిర్యాదు చేయకుండా వెనక్కి తగ్గిన వైనం

సాక్షి, అమరావతి: ‘కే టాక్స్‌’ వ్యవహారంలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తెపై వస్తున్న ఫిర్యాదులపై నోరు మెదపకూడదని టీడీపీ నిర్ణయించినట్లు తెలిసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెలను వెనకేసుకుని వస్తే ఉన్న పరువు కూడా పోతుందని ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉంటే మంచిదని పలువురు పార్టీ సీనియర్‌ నేతలు సూచించడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తమ నుంచి డబ్బులు వసూలు చేశారని అనేక మంది బాధితులు కోడెలతో పాటు ఆయన కుమారుడు, కుమార్తెపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవన్నీ రాజకీయ వేధింపుల్లో భాగంగానే వస్తున్నాయని ఒక ప్రతినిధి బృందం డీజీపీకి ఫిర్యాదు చేయాలని రెండురోజుల క్రితం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయించారు.

సోమవారం ఆ బృందం డీజీపీని కలవాలని నిర్ణయించినా టీడీపీ నాయకులెవరూ వెళ్లలేదు. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో పలువురు నాయకులు కోడెల వైఖరిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చంద్రబాబు మిన్నకుండిపోయినట్లు సమాచారం. కోడెల కుటుంబీకులపై ఎప్పటి నుంచో తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, చాలామంది ఆయన, ఆయన కుమారుడు, కుమార్తె అవినీతి వ్యవహారాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని టీడీపీ ఉప నేత బుచ్చయ్యచౌదరి ఆ సమావేశంలో మండిపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పార్టీ తలదూర్చితే ఆయన అవినీతి వ్యవహారాలను సమర్థించినట్లవుతుందని, మౌనంగా ఉంటే మంచిదని, లేకపోతే ఉన్న పరువు కూడా పోతుందని చెప్పడంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. అందుకే కోడెలను సమర్థిస్తూ ఏ ఒక్క టీడీపీ నాయకుడు మాట్లాడేందుకు ముందుకు రావడంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: కోడెల బండారం బట్టబయలు)

మరిన్ని వార్తలు