‘ఆ భావన తీసుకొచ్చేందుకే చంద్రబాబు కృషి’

16 Dec, 2018 13:11 IST|Sakshi

సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదనే భావన తీసుకొచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్‌ నేతలు మండిపడ్డారు. టీడీపీ అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం’లో కేంద్ర పథకాలను వివరించాలని కోరారు. అశోక్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. పూటకో పార్టీతో పొత్తుకునే చంద్రబాబు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను బీజేపీపై నెట్టాలని చూస్తున్నారని ద్వజమెత్తారు. 

ఆయన సత్తా తేలిపోయింది..
రాబోయే కాలంలో నుంచి 7 నుంచి 8 మంది మంత్రులు, 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడబోతున్నారని మాణిక్యాలరావు అన్నారు. చంద్రబాబు సత్తా ఏమిటో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిందనీ, ఆయనకు ప్రజలు తగిన బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు. ‘రాఫెల్ ఒప్పందంలో అబద్ధాన్ని పదేపదే చెప్పి రాహుల్ ప్రజల్ని నమ్మించే యత్నం చేశారు. అందుకే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాఫెల్ పేరుతో కాంగ్రెస్ కుట్రకు పాల్పడిందనే అనుమానాలు కలుగుతున్నాయి’అని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని అభూత కల్పనలు చేసినా, ఎంత డబ్బు వెదజల్లినా ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. తెలంగాణలో మాదిరిగానే 2019 ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాభావం తప్పదని జోస్యం చెప్పారు. ఏపీలో కూడా మహా కూటమికి ఘోర పరాజయం పాలవుతుందన్నారు.

మరిన్ని వార్తలు