పక్కదారి పట్టించేందుకు బాబు పక్కా స్కెచ్‌

26 Oct, 2018 03:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో గురువారం జరిగిన హత్యాయత్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు, తెలుగుదేశం నేతల తీరు ప్రజల్లో ఏవగింపు కలిగించడంతో పాటు పలు అనుమానాలకు తెరలేపింది. హత్యాయత్నం ఘటన అనంతరం ప్రభుత్వం రాజకీయంగా దాన్ని పక్కదారి పట్టించడానికి అనేక నాటకాలకు, తప్పుడు ప్రచారానికి దిగడం తెలిసిందే. ఘటన జరిగిన మరుక్షణం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వ్యవహారంపై తమ నాయకులకు, మరోపక్క పోలీసు అధికారులకు ఎలా స్పందించాలో మార్గనిర్దేశం చేశారు.

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎంఓ అధికారులు దఫదఫాలుగా ఘటన గురించి చెవిలో చెబుతూ రాగా, సీఎం అక్కడి నుంచే పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ రాజకీయాలకు తెరలేపారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించేలా మంత్రులకు సూచనలు అందించారు. ఎవరు ఎలా ఏయే అంశాలను మాట్లాడి ప్రధాన ప్రతిపక్షంపైనే ఈవ్యవహారాన్ని నెడుతూ పక్కదారి పట్టించేలా వ్యూహానికి తెరలేపారు. తదనుగుణంగా మంత్రులు వైఎస్‌ జగన్‌పై, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపైనా మీడియా సమావేశాలు పెట్టి ఎదురు దాడికి దిగారు.  

గవర్నర్, కేంద్ర మంత్రులు వివరాలు తెలుసుకుంటే తప్పేంటి? 
కేబినెట్‌ హోదా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం ఘటన జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపగా తీవ్రంగా స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా రాజకీయాలకు తెరలేపడం ప్రజలకు విస్తుగొలిపింది. రాజకీయంగా ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికి ఇంతదారుణాలకు తెగబడతారా? దాన్ని పక్కదారి పట్టించేందుకు మరీ ఇంత నీచమైన రాజకీయాలకు దిగుతారా? అని జనం చీత్కరించుకుంటున్నారు. (వైఎస్‌ జగన్‌ కేసు..దర్యాప్తు ఎలా ఉంటుందో)

పోలీసు అధికారులు, మంత్రులు చేసిన ప్రకటనలతోనే ఈ హత్యాయత్నం వెనుక ఎవరున్నారు? పక్కదారి పట్టించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమవుతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరగడంపై గవర్నర్‌ నరసింహన్‌ డీజీపీ ఠాకూర్‌ నుంచి వివరాలు తెలుసుకోవడాన్ని కూడా మంత్రులు తప్పుబడుతూ రాజకీయం చేయడంపై ప్రజలు విస్తుపోతున్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే, ఆ వివరాలు తెలుసుకోవడం గవర్నర్‌ బాధ్యత అని.. దాన్ని కూడా ముఖ్యమంత్రి, మంత్రులు తప్పుబట్టడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. 

అనుమానాలకు తావిచ్చిన డీజీపీ ప్రకటన 
ఘటన జరిగిన కొంత సేపటికి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాసరావు వైఎస్‌ జగన్‌ అభిమాని అని, అతనికి మానసిక పరివర్తన సరిగా లేదని, ప్రచారం కోసమే వైఎస్‌ జగన్‌పై దాడి చేశాడని చెప్పారు. విచారణ ఇంకా మొదలు కాకుండానే డీజీపీ ఇలా ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చిందని పలువురు తప్పు పడుతున్నారు. మరోపక్క మంత్రులు.. ఆపరేషన్‌ గరుడలో భాగంగా ఇది జరిగిందని ఒకసారి, వైఎస్‌ జగన్‌ తన అభిమానితో ఇలా దాడి చేయించుకున్నారని మరోసారి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా సీఎం ప్రెస్‌మీట్‌లో ఆయన హావభావాలపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  (వైఎస్‌ జగన్‌పై దాడి: ఏఏఐ ప్రకటన)

అభిమానులు ప్రాణాలు తీస్తారా? 
పాదయాత్ర చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ పెంచాలని పలుమార్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విన్నవించినా, లేఖలు రాసినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? వైఎస్‌ జగన్‌కు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు చెడిపోయాయని, వాటిని మార్చి వేరే వాటిని ఇవ్వాలని కోరినా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం లేకపోవడంపై అనుమానాలు ఏర్పడుతున్నాయి.

ఎవరైనా అభిమాని ప్రాణాలు ఇస్తారు కానీ ప్రాణాలు తీస్తారా? మతి స్థిమితం లేని వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌ క్యాంటీన్‌లో ఎలా చేర్చుకున్నట్లు? వైఎస్సార్‌సీపీ అభిమానిని టీడీపీ నేత పనిలో పెట్టుకున్నాడా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎయిర్‌పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కనుక అక్కడ ఏం జరిగినా దానికి కేంద్రానిదే బాధ్య త అని చెప్పి తప్పించుకోవడానికి అదే అనువైన స్థలమని ఒక ప్రణాళిక ప్రకారం నిందితుడిని అక్కడ ప్రవేశపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.  

రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదా? 
ఎయిర్‌పోర్టు సీఐఎస్‌ఎఫ్‌ పరిధిలో ఉంది కనుక అక్కడ జరిగిన ఘటనకు కేంద్రానిదే బాధ్యత అన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడడం   ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ ఘటనపై విచారణ జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అన్న ప్రశ్నలు కూడా పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. తమ రాజకీయాధికారానికి అడ్డుగా ఉన్న నేతలను భౌతికంగా అంత మొందించాలనుకోవడం దారుణమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.  
 

మరిన్ని వార్తలు