కేఈ కుటుంబానికి రెండు సీట్లు

23 Feb, 2019 13:32 IST|Sakshi

డోన్, పత్తికొండకు ఓకే చెప్పిన టీడీపీ అధినేత

ఆదోని నుంచి మీనాక్షి నాయుడు ఔట్‌

బుట్టా రేణుకకు ఛాన్స్‌! కర్నూలు సీటు ఎస్వీకే..

సమావేశం ముందుగానే అనుకూల మీడియాకు లీకులిచ్చిన వైనం

నేడు నంద్యాల పార్లమెంటు సీట్లపై కసరత్తు

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  కర్నూలు జిల్లాలో సీట్ల కేటాయింపుపై గురువారం కసరత్తు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా మొదట కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల కసరత్తును శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ చేపట్టారు. కేఈ కుటుంబానికి పత్తికొండ, డోన్‌ సీట్లను ఖరారు చేసినట్టు తెలిసింది. పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్‌ నుంచి కేఈ ప్రతాప్‌ బరిలో ఉండేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇక ఆదోని నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన మీనాక్షి నాయుడుకు మొండిచేయి చూపారు. ఈ స్థానం నుంచి బుట్టా రేణుకను బరిలో దించాలని భావిస్తున్నారు. కర్నూలు సీటు కోసం పోటీ పడుతున్న ఎస్వీ మోహన్‌ రెడ్డి, టీజీ భరత్‌ల్లో.. ఎస్వీవైపే చంద్రబాబు మొగ్గుచూపినట్టు తెలిసింది. ఎస్వీకే సీటు ఇవ్వాలని మంత్రి లోకేష్‌ పట్టుబట్టడంతో సీఎం అంగీకరించినట్లు సమాచారం.

కర్నూలు నియోజకవర్గంపై సమావేశం జరగక ముందే..ఎస్వీకే సీటు ఖరారు అంటూ అనుకూల మీడియాకు లీకులిచ్చి బ్రేకింగ్‌ ఇప్పించినట్టు తెలుస్తోంది. ఈ స్థానంలో సర్వే ప్రకారం ఎస్వీకి వ్యతిరేకత ఉన్నప్పటికీ.. టీజీ వర్గం కచ్చితంగా సహకరించి గెలిపించాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఎమ్మిగనూరు సీటుజయనాగేశ్వరరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించగా.. మంత్రాలయం సీటు ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డికే కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆలూరు, కోడుమూరు సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రధానంగా కోట్ల కుటుంబం పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆలూరు సీటుపై స్పష్టత ఇవ్వలేదు. ఎమ్మెల్యే మణిగాంధీ, ఇన్‌చార్జ్‌ విష్ణువర్దన్‌ రెడ్డి మధ్య విభేదాల నేపథ్యంలో కోడుమూరు సీటు ఖరారు కాలేదని తెలిసింది. కోట్ల చేరిక అనంతరమే ఈ రెండు సీట్లపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఎంపీగా పోటీలో ఉంటారని, కావున ఆదోని నుంచి బరిలో ఉండాలని బుట్టా రేణుకకు సూచించినట్టు తెలిసింది. మరోవైపు బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా చంద్రబాబు దాదాపుగా ఖరారు చేశారు. 

కలసి పనిచేయాల్సిందే!
ఈ ఎన్నికలు పార్టీకి ఎంతో కీలకమని, అందరూ కచ్చితంగా కలసి పనిచేయాల్సిందేనని కర్నూలు నేతలకు చంద్రబాబు చెప్పారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైతే అందరి రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందులు ఉంటాయని అన్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఏయే నేతలతో ఏ విధంగా ఉంటున్నారు? వారిని ఏ విధంగా కలుపుకుని పోవాలనే అంశాలను కూడా వివరించినట్టు సమాచారం.

గంటకో నియోజకవర్గం...
వాస్తవానికి కర్నూలు జిల్లా సమీక్ష సమావేశం గురువారం సాయంత్రమే జరగాల్సి ఉంది. అయితే, వైఎస్సార్‌ జిల్లా  సమీక్ష సమావేశం గురువారం రాత్రి 11.30 వరకూ కొనసాగింది. దీంతో జిల్లా సమీక్ష పైపైన చేసి శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం సాయంత్రం కర్నూలు పార్లమెంటు పరిధిలోని సీట్లపై కసరత్తు ప్రారంభించారు. మొదట డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని పిలిచి మాట్లాడారు. పత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తినే పోటీ చేయాలని కోరినట్టు తెలిసింది. అయితే, వయసురీత్యా తాను పోటీలో ఉండలేనని, తన కుమారుడికి సీటు ఇవ్వాలని ఆయన కోరినట్టు సమాచారం. ఇందుకు సీఎం అంగీకరించడమే కాకుండా డోన్‌ కూడా ఆయన కుటుంబీకులకే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఒక్కో నియోజకవర్గం సమీక్షకు సుమారు 45 నిమిషాల నుంచి గంటపాటు చంద్రబాబు కేటాయించారు. ఈ సందర్భంగా అభ్యర్థికి ఉన్న పాజిటివ్‌ అంశాలతో పాటు నెగటివ్‌ అంశాలను ఆయన వివరించారు. ఏ విధంగా ముందుకు వెళ్లాలి.. పార్టీ తరఫున ఎంత ఫండింగ్‌ ఇస్తారన్న అంశాన్ని కూడా పేర్కొంటున్నట్టు సమాచారం. ఈ డబ్బును ఎవరు చేరవేస్తారు? ఏ విధంగా చేరవేస్తారనే విషయాన్ని కూడా వివరించినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు