పిల్లలూ ప్రచారాస్త్రాలే!

23 Oct, 2018 10:41 IST|Sakshi

హిందూపురం నియోజకవర్గంలో ఓ ఏజెన్సీతో ఉచిత పుస్తకాల పంపిణీ

వాటిపై ప్రభుత్వ పథకాల ముద్రణ

వాటిని అందరికీ వివరించాలని విద్యార్థులకు సూచన

సాక్షి, చిలమత్తూరు: విద్యార్థులకు పంపిణీ చేసే నోట్‌ పుస్తకాలనూ టీడీపీ నేతలు తమ ప్రచార అస్త్రంగా మార్చుకున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని ఆరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు పంపిణీ చేయాలని ఓ ట్రాక్టర్‌ కంపెనీ ఏజెన్సీని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ ఆదేశించారు. ఆ కంపెనీకి చెందిన ట్రాక్టర్లను రైతు రథం కింద రైతులకు అందించేందుకు అంతకుముందే ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పీఏ ఆదేశం మేరకు ఆ ఏజెన్సీ నోట్‌ పుస్తకాలను తీసుకొచ్చింది. వాటిని ఆరు పాఠశాలలకు చెందిన 2 వేల మంది విద్యార్థులకు సోమవారం ఎమ్మెల్యే పీఏతో పాటు జడ్పీటీసీ తదితరులు పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా పుస్తకాలపై ముద్రించిన ప్రభుత్వ పథకాల గురించి తల్లిదండ్రులతో పాటు అందరికీ వివరించాలని విద్యా ర్థులకు సూచించారు. పుస్తకంపైన ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు, బాలకృష్ణ బొమ్మలతో పలు కార్యక్రమాల గురించి ముద్రించారు. లోపలి పేజీల్లో ట్రాక్టర్ల పంపిణీ గురించి.. పుస్తకం వెనుక పలు పథకాలను వివరించేలా బొమ్మలు వేశారు. ఈ పుస్తకాలను చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇదెక్కడి చోద్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేకాధికారులు, కార్యదర్శులతో ఎమ్మెల్యే పీఏ అధికారిక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని వార్తలు