కుప్పంలో ప్రజాశాంతి తరఫున టీడీపీ కార్యకర్త నామినేషన్‌

26 Mar, 2019 10:40 IST|Sakshi

హెలికాఫ్టర్, ఫ్యాన్‌ గుర్తులపై ఓటర్లను అయోమయానికి గురిచేయడమే ధ్యేయం

సాక్షి, కుప్పం: సీఎం చంద్రబాబు పోటీ చేస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ తరఫున టీడీపీ కార్యకర్త నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్లకు ఆఖరి రోజైన సోమవారం మధ్యాహ్నం 2:40 గంటలకు టీడీపీ నేతలు హఠాత్తుగా ఎన్నికల అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ వేశారు. చివరి నిమిషంలో నామినేషన్‌ దాఖలు చేయడంలో గల ఆంతర్యమేమిటనేది చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి తరలివచ్చిన జనసంద్రాన్ని చూసి టీడీపీ నేతల్లో గుబులు పుట్టుకుంది.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఎన్నికల గుర్తు హెలీకాఫ్టర్‌. ఈ గుర్తు వైఎస్సార్‌సీపీ పార్టీ గుర్తైన ఫ్యానుకు సామీప్యంగా ఉంటుంది. దీంతో ఓటర్లును అయోమయానికి గురిచేయాలన్న ఉద్దేశంతో ప్రజాశాంతి పార్టీ తరఫున టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దింపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాను గుర్తుకు వచ్చే ఓట్లను హెలీకాఫ్టర్‌ గుర్తుకు మళ్లించాలనే ఉద్దేశంతోనే ఈ పనికి పూనుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన బాలకుమార్‌ టీడీపీకి పూర్తిస్థాయి కార్యకర్త. ఈయనకు ధరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసిన న్యాయవాది, చంద్రబాబు నామినేషన్‌ను సరిచూసిన న్యాయవాది ఒక్కరే కావడం గమనార్హం. అంతేకాక పార్టీ అభ్యర్థిని ప్రతిపాదించినది కూడా శాంతిపురం మండలానికి చెందిన టీడీపీ నాయకులే. కుప్పం ప్రజలు ఫ్యాన్‌పై మొగ్గు చూపుతుండటంతో, వీరిని తప్పుదోవ పట్టించడానికి హెలికాఫ్టర్‌ గుర్తు కూడా బ్యాలెట్‌పై ఉంటే కొన్ని ఓట్లయిన తగ్గించవచ్చనే ఉద్దేశంతో టీడీపీ నాయకులే దగ్గరుండి నామినేషన్‌ వేయించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు