టీడీపీ శ్రేణుల దౌర్జన్యం

4 Apr, 2019 11:16 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తలారి వెంకట్రావు ప్రచార రథాన్ని చుట్టుముట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

గోపాలపురం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తలారి ప్రచారం అడ్డగింత

అసభ్య పదజాలంతో దూషణ.. నిర్బంధం

సాక్షి, ద్వారకాతిరుమల : ఓటమి భయంతో టీడీపీ నేతలు బరితెగించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుకు పెరుగుతున్న జనాభిమానాన్ని చూసి ఓర్వలేక ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. న్యూస్‌ కవరేజ్‌కు వెళ్లిన సాక్షి మీడియాపై సైతం టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు.  ద్వారకాతిరుమల మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం నుంచి వైఎస్సార్‌ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తలారి వెంకట్రావుకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి ఓర్వలేక.. వైఎస్సార్‌సీపీ ప్రచారాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఎం.నాగులపల్లిలో బుధవారం సాయంత్రం తలారిని అడ్డుకున్నారు. 

ఉద్దేశపూర్వకంగా బైక్‌ అడ్డుపెట్టి.. 
తలారి ప్రచార రథం ఎం.నాగులపల్లికి చేరగానే టీడీపీ నేతలు ఒక బైక్‌ను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త బైక్‌కు ఉన్న జెండా కర్ర, టీడీపీ నేత బైక్‌కు తగిలింది. దీంతో టీడీపీ నేత ఇష్టానుసారం బూతులు తిడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడిచేశాడు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా తలారి వాహనాన్ని అడ్డుకున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా చూడకుండా తలారిని ఇష్టానుసారం దూషించారు. తలారిని నిర్బంధించి ఆయన కారును సైతం ధ్వంసం చేశారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులను, అక్కడకు చేరుకున్న ప్రజలను, మీడియా వారిని భయబ్రాంతులకు గురిచేసేలా టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ పలువురు డీఎస్పీలు, సీఐలను సంఘటనా స్థలానికి పంపించారు.

వారి ఆధ్వర్యంలో భీమడోలు సీఐ సీహెచ్‌ కొండలరావు, స్థానిక పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేశారు. నిర్భంధంలో ఉన్న తలారిని, వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలను విడిపించారు. అంతకుముందు న్యూస్‌ కవరేజ్‌ నిమిత్తం అక్కడకు వెళ్లిన సాక్షి దినపత్రిక, ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకర్లపై కూడా టీడీపీ శ్రేణులు దౌర్జన్యం చేయడంతో పాటు దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా గ్రామంలో ప్రత్యేక దళాలను మోహరించారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం గోపాలపురం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా, ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ప్రచారానికి వెళుతున్న ముప్పిడిని ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతో తలారి ప్రచారాన్ని అడ్డుకోవాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. తలారి ప్రచారాన్ని కూడా ప్రజలు అడ్డుకుంటున్నారని చూపే ఎత్తుగడతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 

మరిన్ని వార్తలు