అధికార పార్టీ నేత బరితెగింపు

16 Mar, 2018 06:36 IST|Sakshi
కబ్జా చేసిన ఇల్లు ఇదే

ఓ ఇల్లు కబ్జా .. కేసు నమోదు

రోడ్డునపడ్డ బాధిత కుటుంబం

గుణదల (విజయవాడ ఈస్ట్‌) : అధికార పార్టీ నేతలు ఇళ్ల కబ్జాలకు బరి తెగిస్తున్నారు. లక్షలాది రూపాయల విలువచేసే ఓ ఇంటిని కబ్జా చేసిన విషయం పోలీసు రికార్డుల కెక్కడంతో టీడీపీ నేతల దోపిడీ బట్టబయలైంది. యజమాని ఇంట్లో లేని సమయంలో స్థానిక టీడీపీ నాయకుడు తన అనుచరులతో ఆ ఇంటికి తాళం వేసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెలిబుచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, క్రీస్తురాజపురం పెద్ద బావి సెంటర్‌లోని డోర్‌ నెం.53–1–302 నంబరు గల ఇంటిలో కొక్కెరగడ్డ కన్నయ్య (36) కుటుంబం నివాసం ఉంటోంది. ప్రభుత్వాసుపత్రిలో కన్నయ్య కాంట్రాక్ట్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు. ఏడేళ్లుగా అద్దెకు ఉంటూ ఏడాది క్రితం ఆ ఇంటిని కొనుగోలు చేశాడు. కొనుగోలు సమయంలో ఆ ఇంటిని అమ్మిన బూరగడ్డ రామకృష్ణకు పది లక్షల నగదు ముట్టచెప్పాడు. 182 చ.గజాల్లో ఉన్న ఆ ఇంటిని కబ్జా చేసే దిశగా స్థానిక టీడీపీ నాయకుడు నందిపాటి దేవానంద్‌ పధకం రచించాడు.

ఈ నేపథ్యంలో ఈ నెల 10న కన్నయ్య తన కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూస్తే తన ఇంటికి వేరే తాళం వేసి ఉంది. స్థానికులను ఆరా తీస్తే తనకు ఇంటిని అమ్మిన బూరగడ్డ రామకృష్ణ.. తానే తాళం వేశానని, ఈ ఇంటిని వేరే వ్యక్తులకు అమ్మినట్లు తెలిపాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇంతలో దేవానంద్‌ తన అనుచరులతో వచ్చి కన్నయ్యపై దాడికి దిగారు. ఈ ఇల్లు నీది కాదు.. నువ్వు ఏం చేస్తావో చేసుకో పో.. అంటూ దౌర్జన్యం చేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కన్నయ్య మాచవరం పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. పోలీసులు దర్యాప్తు చేసి కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. బూరగడ్డ రామకృష్ణ, శ్రీదేవి, వరప్రసాద్, దేవానంద్, అవినాష్, జ్యోతి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై 506, 448, 427 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో ఈ ఇంటి వ్యవహారంలో బాధితుడు కోర్టునుంచి ఇంజక్షన్‌ ఆర్డరు కూడా తెచ్చుకున్నాడు. దాన్ని సైతం లెక్క చేయకుండా దౌర్జన్యానికి పాల్పడటంతో పోలీసులు నిందితులపై ఫైర్‌ అయినట్లు సమాచారం.

ఫిర్యాదులో వివరాలు..
తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, వెండి, బంగారు నగలు, ఇన్య్సూరెన్స్‌ బాండ్లు, విలువైన వస్తువులు దొంగిలించారని బాధితుడు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పది లక్షలకు కొనుగోలు చేసిన ఇంటిని కబ్జా చేయగా, ఇంట్లో ఉన్న మరో పది లక్షల విలువైన సామాగ్రిని అపహరించారని పేర్కొన్నాడు.  

కట్టుబట్టలతో...
టీడీపీ నాయకుల దాడికి భయపడిన కన్నయ్య కుటుంబం రోడ్డున పడింది. దీంతో దిక్కుతోచన పరిస్థితుల్లో భార్య స్రవంతి, పిల్లలు నయనిక, సహశ్రికలతో కలిసి కట్టుబట్టలతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. తనకు న్యాయం చేయమంటూ అర్ధించాడు. కట్టుబట్టలతో స్టేషన్‌కు బాధితులు రావడం స్టేషన్‌ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో పోలీసులు అవాక్కయ్యారు.

మరిన్ని వార్తలు