-

సంచలన వ్యాఖ్యలు చేసిన తేజ్‌ ప్రతాప్‌

3 May, 2019 15:02 IST|Sakshi

పట్నా : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఆఖరిదశకు చేరుకుంటున్న నేపథ్యంలో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుల మధ్య విభేదాలు ఒక్కోటిగా బయట పడుతున్నాయి. గత కొద్ది కాలంగా లాలూ ప్రసాద్‌ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెహానాబాద్‌లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా చంద్ర ప్రకాశ్‌ను బరిలో దింపాడు. అతని తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తేజ్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ.. ‘లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చాలా శక్తివంతుడు. ఆయన రోజుకు 10 - 12 కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. కానీ ఇప్పటి నాయకులు రోజుకు 2, 3 కార్యక్రమాల్లో పాల్గొనగానే అస్వస్థతకు గురవుతున్నారం’టూ పరోక్షంగా సోదరుడు తేజస్విని విమర్శించారు.

అనారోగ్య కారణాల దృష్ట్యా కొద్ది రోజులుగా తేజస్వి యాదవ్‌ పలు ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని తేజ్‌ ప్రతాప్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘లాలూ ప్రసాద్‌ యాదవే మాకు ఆదర్శం.. ఆయన నాకు గురువు కూడా. ఆయన రక్తాన్ని పంచుకుపుట్టిన నేనే బిహార్‌కు మరో లాలూని’ అని పేర్కొన్నారు. అంతేకాక ప్రస్తుతం పార్టీ రోజు వారీ కార్యక్రమాలు చూస్తున్న వ్యక్తి.. అనర్హులకు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. తన అభ్యర్థి చంద్ర ప్రకాశ్‌ భారీ మెజార్టీతో గెలుస్తాడని తేజ్‌ ప్రతాప్‌ ధీమా వ్యక్తం చేశాడు. వివాహ బంధంలో వచ్చిన విబేధాల కారణంగా కొద్ది నెలలుగా తేజ్‌ ప్రతాప్‌ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు