తమ్ముడితో విభేదాలపై స్పందించిన తేజ్‌ ప్రతాప్‌

14 Sep, 2018 10:48 IST|Sakshi

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ కుటుంబంలో విభేదాలు చోటుచేసుకున్నాయనే వార్తలను ఆయన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఖండించారు. 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై చర్చించడానికి మంగళవారం బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో జరిగిన పార్టీ సమావేశానికి తేజ్‌ ప్రతాప్‌ హాజరు కాలేదు. దీంతో తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో విభేదాల కారణంగానే ఆయన సమావేశంలో పాల్గొనలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తేజ్‌ ప్రతాప్‌ స్పందిస్తూ.. తేజస్వీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆ రోజు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లనే పార్టీ సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. తన తండ్రి ఉన్నంతకాలం తనను ఆర్జేడీ పార్టీ నుంచి ఎవరు తొలగించలేరని పేర్కొన్నారు. 

తమ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ, ఆరెస్సెస్‌లతోపాటు తమ పార్టీలోని కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారని తేజ్‌ ప్రతాప్‌ విమర్శించారు. పార్టీలో అధికారం కోసం తేజస్వీతో పోటీ లేదని వెల్లడించారు. తన తమ్ముడు తేజస్వీని బిహార్‌ సీఎంగా చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇద్దరు అన్నదమ్ములం కలిసి పనిచేస్తామని.. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటామని పేర్కొన్నారు. కాగా, గత కొంతకాలంగా తేజస్వీ, తేజ్‌ ప్రతాప్‌ల మధ్య విభేదాలు ఉన్నట్టు తరచు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు