లాలూకు షాకిచ్చిన ‘వియ్యంకుడు’!

14 Feb, 2020 13:14 IST|Sakshi

పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ కుటుంబంతో అన్ని బంధాలు తెగిపోయినట్లేనని ఆయన వియ్యంకుడు, పార్టీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్‌ అన్నారు. అదే విధంగా ఆర్జేడీలో ఆత్మగౌరవంతో జీవించే వాళ్లకు చోటు లేదని.. పార్టీలో ఎవరికీ స్వేచ్చగా వ్యవహరించే హక్కు లేదని పేర్కొన్నారు. చంద్రికా రాయ్‌ కుమార్తె ఐశ్వర్యా రాయ్‌ వివాహం.. లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌తో జరిగిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో పెళ్లైన కొన్నిరోజులకే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తనకు విడాకులు కావాలంటూ తేజ్‌ప్రతాప్‌ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన కుమార్తె ఐశ్వర్యను లాలూ భార్య రబ్రీదేవి సహా ఇతర కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేశారంటూ చంద్రికా రాయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. (‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్‌ లాక్కొన్నారు’)

ఈ క్రమంలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రికా రాయ్‌.. ఆర్జేడీని వీడి జేడీయూలో చే​రేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆర్జేడీ నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరించిన చంద్రికా రాయ్‌.. గురువారం ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో రహస్యంగా భేటీ కావడం బిహార్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంతో సమావేశమైన అనంతరం చంద్రికా రాయ్‌ మీడియాతో మాట్లాడుతూ... ఆర్జేడీ తీరుపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా... నితీశ్‌ కుమార్‌ దార్శినికత గల ముఖ్యమంత్రి అని, ఆయన హయాంలో బిహార్‌ అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు.(మేం తీసుకోం.. పబ్లిసిటీ కోసం చిల్లర చేష్టలు)

కాగా పార్సా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రికా రాయ్‌ ఆర్జేడీని వీడినట్లయితే యాదవ్‌ సామాజిక ఓట్లు భారీగానే చీలిపోతాయంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక చంద్రికా రాయ్‌ గతంలో నితీశ్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఆర్జేడీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా... జేడీయూ ఉపాధ్యక్షుడిగా పనిచేసి బహిష్కరణకు గురైన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఫిబ్రవరి 18న తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని తెలపడంతో బిహార్‌ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా