అక్కడ సీసీటీవీ కెమెరా ఎందుకోసం పెట్టారు?

15 Nov, 2018 13:06 IST|Sakshi
తేజస్వీ యాదవ్‌ ట్వీట్‌ చేసిన ఫొటో

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. తన ఇంటి సరిహద్దుల్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడంపై ట్విటర్‌లో స్పందించిన తేజస్వీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరుస ట్వీట్లతో నితీశ్‌పై విరుచుకుపడ్డారు. నితీశ్‌ ప్రతిపక్ష పార్టీ నేతలపై నిఘా పెట్టడం మానుకోవాలని సూచించారు. ఆయన తన భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలు ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు.

పట్నాలో తన ఇంటి పక్కనే నితీశ్‌ ఉంటుందని తేజస్వి తెలిపారు. తమ ఇళ్ల మధ్య ఉన్న సరిహద్దు గోడపై చాలా ఎత్తులో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం వెనుక అర్థమెంటని తేజస్వీ ప్రశ్నించారు. దీని ద్వారా అవతలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతోందని వాపోయారు. ఇలాంటి పనులు చేయవద్దని నితీశ్‌కు ఎవరైనా సూచించడని వ్యంగ్యంగా స్పందిచారు. పట్నాలో నేరాలు సంఖ్య పెరిగిపోతున్న పట్టించుకోని సీఎం.. ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. పౌరులకు భద్రత కల్పించాల్సింది పోయి.. వారి గోపత్యకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు.

అలాగే నితీశ్‌ విలాసవంతమైన జీవితం గుడుపుతున్నాడని ఆరోపించారు. నితీశ్‌కు మూడు సీఎం నివాసాలు ఉంటే.. అందులో 2 పట్నాలో, ఒకటి ఢిల్లీలో ఉన్నాయని పేర్కొన్నారు. వాటితో పాటు బిహార్‌ భవన్‌లో మరో విలాసంతమైన సూట్‌ ఉందని తెలిపారు. ఒక పేద రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత విలాసవంతమైన జీవితం అవసరమా అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే నైతికత నితీశ్‌కు ఉందా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు