‘నాకు మా నాన్న అంత విశాల హృదయం లేదు’

17 Sep, 2018 08:53 IST|Sakshi
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌(ఫైల్‌ ఫోటో)

పాట్నా : మోదీజీ 2 కోట్ల మంది పకోడాలు వేస్తారు సరే.. మరి వాటన్నింటిని ఎవరూ తింటారు..? మీరు ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తామన్నారు. అందులో నుంచి ఓ రెండు లక్షలు ఇస్తే పకోడా బండి ప్రారంభిస్తాం.. అంటూ రాష్ట్రీయా జనతా దళ్‌ నేత తేజస్వీ యాదవ్‌ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడిన తేజస్వీ యాదవ్‌ పలు అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన.. ‘ ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని వాగ్ధానం చేశారు. 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పారు. ఇప్పుడేమో యువతను స్వయం ఉపాధి పేరుతో పకోడాలు వేసుకోమంటున్నారు. సరే అదే చేస్తాం.. కానీ పకోడా బండి పెట్టుకోవడానికి కూడా 1 - 2 లక్షలు ఖర్చు అవుతోంది. జనాలకు ఇస్తానన్న 15లక్షల రూపాయల్లో నుంచి ఓ రెండు లక్షలు ఇస్తే పకోడా బండి పెట్టుకుంటారు’ అంటూ ఎద్దేవా చేశారు.

తేజస్వీ కొనసాగిస్తూ అమిత్‌ షా ఇంకో 50 ఏళ్ల పాటు బీజేపీనే అధికారంలో ఉంటుంది అంటున్నారు. నాలుగేళ్లకే దేశంలో నిరంకుశత్వం పెరిగిపోయింది.. అలాంటిది బీజేపీ ఇంకోసారి గెలిస్తే రిజర్వేషన్లను కూడా తొలగిస్తుంది అంటూ ఆరోపించారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ గురించి మాట్లాడుతూ ‘మా నాన్న నితీష్‌ కుమార్‌ని ఎంతో నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చారు. కానీ ఆయన మాత్రం మా నాన్నను జైలు పాలు చేశారు. నాలుగేళ్లలో ఆయన వేర్వేరు పార్టీలను ఆశ్రయించారు. ఇప్పుడు తిరిగి ఆర్జేడీ వైపు చూస్తున్నారు. కానీ నాకు మా నాన్న అంత విశాలమైన హృదయం లేదు’ అని తెలిపారు. ప్రశాంత్‌ కిషోర్‌ జేడీ(యూ) లో చేరడం గురించి స్పందిస్తూ అది చాలా మంచి పరిణామం అంటూ చెప్పుకోచ్చారు.

మరిన్ని వార్తలు