నెల తర్వాత ప్రత్యక్షమైన తేజస్వి.. !

29 Jun, 2019 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ : దాదాపు నెల రోజులుగా ‘కనిపించకుండాపోయిన’  ఆర్జేడీ సీనియర్‌ నేత, పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వి యాదవ్‌ ఎట్టకేలకు మళ్లీ ప్రత్యక్షమయ్యారు. అదీ ట్విటర్‌లో దర్శనమిచ్చారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, బిహార్‌లోనే ఉన్నానని, చాలాకాలంగా వేధిస్తున్న మోకాలి నొప్పికి సంబంధించి శస్త్రచికిత్స చేయించుకోవడం వల్ల బయటకు రాలేకపోయానని శనివారం వరుస ట్వీట్‌లో ఆయన వివరించారు. 

‘మిత్రులారా! గతకొన్ని వారాలుగా ఏసీఎల్‌ గాయానికి సంబంధించి చికిత్స పొందుతూ ఉన్నాను. నా గురించి ప్రత్యర్థులే కాకుండా మీడియాలోని ఓ వర్గం కూడా మసాలా స్టోరీలు ప్రచారం చేయడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది’ అని తేజస్వి ట్వీట్‌ చేశారు. మెదడు వ్యాపు వ్యాధి వల్ల పెద్ద ఎత్తున సంభవించిన పిల్లల మరణాల పట్ల తేజస్వి సంతాపం వ్యక్తం చేశారు. పిల్లల ఆకాల మృతి నేపథ్యంలో వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించాలని పార్టీ కార్యకర్తలకు సూచించానని, ఈ విషయంలో ఫొటో షోకుటప్పులు లేకుండా వారిని ఆదుకోవాలని సూచించానని, అంతేకాకుండా ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని తమ పార్టీ ఎంపీలకు సూచించానని, అందువల్లే ప్రధాని ఈ అంశంపై స్పందించారని పేర్కొన్నారు. 

ప్రతిరోజూ మెదడు వ్యాపు వ్యాధి కారణంగా పెద్ద ఎత్తున చిన్నారులు చనిపోతున్నా.. తేజస్వి మీడియా ముందుకు రాకపోవడం, రాజకీయంగా కనిపించకపోవడం దుమారం రేపింది. మెదడు వ్యాపు వ్యాధికి కేంద్రంగా ఉన్న ముజఫర్‌పూర్‌లో తేజస్వి అదృశ్యమయ్యారని పోస్టర్లు వెలిశాయి. ఆయన ఆచూకీ చెప్పినవారికి రూ. 5,100 నజరానా ఇస్తానని ఆ పోస్టర్లలో ప్రకటించారు కూడా. మాజీ డిప్యూటీ సీఎం అయిన తేజస్వి ముజఫర్‌పూర్‌ను ఇప్పటివరకు సందర్శించలేదు. ఇక, గతంలో తేజస్వి  ఎక్కడ అని ఆ పార్టీ సీనియర్‌ నేత రఘువంశ ప్రసాద్‌ సింగ్‌ను మీడియా ప్రశ్నించగా.. ఏమో ఆయన వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను చూసేందుకు వెళ్లారేమోనంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

>
మరిన్ని వార్తలు