‘నాగ్‌పూర్‌ చట్టాలను అమలు చేయాలని చూస్తున్నారు’

14 Jan, 2019 09:52 IST|Sakshi

లక్నో: బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని ఆదివారం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కలిశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదుర్కొవడానికి ఎస్పీ, బీఎస్పీలు ఒకటిగా పోటీ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే తేజస్వీ, మాయావతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం తేజస్వీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో, బిహార్‌లో బీజేపీకి ఘోర ఓటమి తప్పదని అన్నారు. యూపీలో అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఎస్పీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా వెళ్లడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. 

బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కకుపెట్టి.. నాగ్‌పూర్‌ చట్టాలను అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. అఖిలేశ్‌, మాయావతి కలయికను ప్రజలు కూడా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. యూపీలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. కాగా, ఎస్పీ, బీఎస్పీ కూటమిలోకి కాంగ్రెస్‌ను చేర్చుకోకపోయినప్పటికీ.. ఆ పార్టీ కోసం అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో తమ కూటమి తరఫున అభ్యర్థులను నిలుపరాదనే నిర్ణయానికి వచ్చాయి. 

మరోవైపు ఆర్జేడీ నేత రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ ఆదివారం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ లేకుండా ఎస్పీ, బీఎస్పీ కూటమిగా ముందుకెళ్లడంపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ఈ పరిణామం మంచిది కాదన్నారు. 

మరిన్ని వార్తలు