చూస్తూ ఉండండి.. ఏం జరుగుతుందో..!

8 Jun, 2018 11:21 IST|Sakshi
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో తేజస్వీ యాదవ్‌(ట్విటర్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ఎన్డీయే తన మిత్ర పక్షాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంటే.. మరోవైపు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు, పార్టీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ కూడా రానున్న ఎన్నికల దృష్ట్యా జేడీయూ, బీజేపీలకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమైన తేజస్వీ యాదవ్‌ సుమారు 40 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు తెలిపారు.

సమావేశం ముగిసిన  తర్వాత తేజస్వీ యాదవ్‌ తాము చర్చించిన అంశాల గురించి తర్వాత వరుస ట్వీట్లు చేశారు. రాహుల్‌ గాంధీతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసిన తేజస్వీ యాదవ్‌.. ‘ఫ్రెంచ్‌ విప్లవం ఆరంభం నుంచే ఎంతో మందికి ఉత్సాహాన్నిచ్చిందంటూ’ బ్రిటీష్‌ కవి విలియం వర్డ్స్‌వర్త్‌ పద్యంలోని పంక్తులను ఉటంకించారు.

‘రాహుల్‌ గాంధీతో సమావేశం ఫలప్రదమైంది. ప్రస్తుత పాలనతో దేశంలో నెలకొన్న భయంకర వాతావరణం నుంచి ప్రజలను రక్షించేందుకు మేము ఒక నిర్ణయానికి వచ్చాం. చూస్తూ ఉండండి! రైతులు, యువత, మహిళలు, పేదల సంక్షేమం కోసం మేము ఏం చేయబోతున్నామో అంటూ’ తేజస్వీ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా.. ‘మేమిక్కడ ఉన్నది ప్రభుత్వాలను మార్చడానికి కాదు. అట్టడుగు వర్గాల ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ, వారి అభిష్టానికి వ్యతిరేకంగా సాగుతున్న పాలనను మార్చాలనుకుంటున్నాం. రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, లౌకిక, ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం చేతులు కలిపాం. అందుకోసం పోరాడుతాం, విజయం సాధిస్తామంటూ’ తేజస్వీ రాసుకొచ్చారు.

మరిన్ని వార్తలు