‘ఆ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా..?’

27 Jun, 2018 11:23 IST|Sakshi
తేజస్వీ యాదవ్‌- నితీశ్‌ కుమార్‌

పట్నా : వచ్చే లోకసభ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో బీజేపీ-జేడీయూల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఫోన్‌ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బీజేపీతో పొత్తు కుదరని పక్షంలో పాత స్నేహితుడిని మచ్చిక చేసుకునేందుకు నితీశ్‌ కుమార్‌ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే తన తండ్రికి నితీశ్‌ కుమార్‌ ఫోన్‌ చేయడంపై లాలూ చిన్న కుమారుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ స్పందించారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి నితీశ్‌ ఫోన్‌ చేశారన్నారు.

ఆ అధికారం వారికి లేదు..
‘ఇది కేవలం ఒక కర్టెసీ కాల్‌ మాత్రమే.. అయినా ఆయనకు ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా..? ఎన్డీయే కూటమిలో నితీశ్‌ ఇమడలేకపోతున్నారని నాకు తెలుసు. కానీ మహా కూటమిలోకి తిరిగి వచ్చేందుకు ద్వారాలు తెరచిలేవంటూ’ తేజస్వీ యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఒకవేళ నితీశ్‌ బీజేపీతో బంధం తెంచుకున్నట్లయితే ఆయనను మహాకూటమిలో చేర్చుకునేందుకు అభ్యంతరం లేదంటూ కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను తేజస్వీ కొట్టిపారేశారు. కూటమిలో ఎవరిని చేర్చుకోవాలన్న విషయంపై నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం వారికి లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో టచ్‌లో ఉన్నానన్న తేజస్వీ.. కాంగ్రెస్‌- ఆర్జేడీ పొత్తు దీర్ఘకాలం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్‌ ప్రణాళికలపై తమకు అవగాహన ఉందని పేర్కొన్నారు.

కాగా విలేకరులతో మాట్లాడిన అనంతరం.. ‘నాన్న ఆస్పత్రిలో చేరిన నాలుగు నెలల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీయడం కోసం నితీశ్‌ జీ ఇప్పుడు ఫోన్‌ చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. బీజేపీ, ఎన్డీయే మంత్రుల తర్వాత నాన్నను పరామర్శించిన చివరి రాజకీయ నాయకుడు ఆయనేనని తెలుసుకున్నారేమో అందుకే ఇప్పుడు ఇలా..’ అంటూ తేజస్వీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు