బిహార్‌లో రావణ, దుర్యోధన పాలన : తేజస్వీ

29 Jul, 2018 13:27 IST|Sakshi
తేజస్వీ యాదవ్‌ (ఫైల్‌ ఫోటో)

పాట్నా : బిహార్‌లో రావణ-దుర్యోధన పాలన సాగుతోందని ఆర్జేడీ నేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ మండిపడ్డారు. బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌లోని బాలికల వసతి గృహంలో 34 మంది మైనర్‌ బాలికలపై అక్కడి సిబ్బంది అత్యాచారాలకు పాల్పడిన ఘటన ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీష్‌ ప్రభుత్వంపై తేజస్వీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, రావణ-దుర్యోధనుడిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని శనివారం ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు  పూర్తిగా క్షిణించిపోయాయని, ఆడ పిల్లలు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారని తేజస్వీ వ్యాఖ్యానించారు.

బాలికల వసతి గృహంలో డ్రగ్స్‌, అబార్షన్‌ మందులు వంటివి ఉన్నాయిని, దీనికి కారణమైన బ్రిజేష్‌ కుమార్‌ అనే వ్యక్తిని ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. ‘బీహార్‌లో రాక్షస పాలన సాగుతోంది.. సీతమ్మను రావణుడు అపహరించాడు.. దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేయించాడు.. బీహార్‌లోనూ రావణ-దుర్యోధన ద్వయం అక్కచెల్లలను, అమ్మలను బయటకు రావడానికి బయపడేలా చేస్తున్నారు. ఇంకా ఎంత మంది బాలికలు వీరి దాష్టికానికి బలికావాలి’ అని విమర్శించారు. ఈ అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఘటనపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది.

ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐని ఆదేశిస్తూ..సీఎం నితీష్‌ కుమార్‌ నిర్ణయం తీసుకున్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కొద్ది నెలల కిందట చేపట్టిన అధ్యయనంలో ఈ కీచకపర్వం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీహార్ అసెంబ్లీ అట్టుడికింది. దీనికి బాధ్యులైన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు