అనంత్‌కుమార్‌ భార్యకు బీజేపీ షాక్‌

27 Mar, 2019 03:29 IST|Sakshi

చివరి నిమిషంలో యువనేత సూర్య పేరు తెరపైకి 

మేనకా గాంధీ, కొడుకు వరుణ్‌లకు మారిన సీట్లు

బెంగళూరు/లక్నో: ఆరు పర్యాయాలు ఎన్నికైన కేంద్రమంత్రి దివంగత అనంత్‌ కుమార్‌ స్థానం నుంచి ఆయన సతీమణి తేజస్వినికి బెంగళూరు(దక్షిణ)టికెట్‌ నిరాకరించిన బీజేపీ.. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు పార్టీలో చేరిన కొద్ది గంటల్లోనే టికెట్టిచ్చింది. అనంత్‌ విజయాల వెనుక కీలకంగా ఉన్న తేజస్విని అందుకు తగినట్లుగా ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. కానీ, సోమవారం రాత్రి తేజస్వి సూర్య(28) అనే యువనేతకు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప స్పందించారు. ‘ తేజస్విని పేరును మాత్రమే రాష్ట్ర కమిటీ ప్రతిపాదించింది. కానీ, అధిష్టానం పేరును మార్చివేసింది. ఇలా ఎందుకు జరిగిందో నాకూ తెలియదు’ అని అన్నారు. పార్టీ నిర్ణయం తనతోపాటు మద్దతుదారులను కూడా షాక్‌కు గురిచేసిందని తేజస్విని మీడియాతో అన్నారు.  కాగా, టికెట్‌ కేటాయించిన సమాచారం తెలిసిన వెంటనే తేజస్వి సూర్య తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.   

39 మందితో  మరో జాబితా
మంగళవారం బీజేపీ మరో 39 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా విడుదల చేసింది. ఇందులో యూపీకి 29, బెంగాల్‌కు సంబంధించి 10 పేర్లు ఉన్నాయి.  కేంద్ర మంత్రి మేనకా గాంధీకి సిట్టింగ్‌ స్థానం ఫిలిబిత్‌ బదులు సుల్తాన్‌పూర్‌ను కేటాయించింది. కొడుకు వరుణ్‌ గాంధీకి ఫిలిబిత్‌ను కేటాయించింది. కేంద్ర మంత్రి మనోజ్‌ సిన్హాను సిట్టింగ్‌ స్థానం ఘాజీపూర్‌ నుంచి, యూపీ మంత్రులు రీటా బహుగుణ జోషి, సత్యదేవ్‌ పచౌరీలను అలహాబాద్, కాన్పూర్‌ల నుంచి బరిలో నిలపనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ప్రకటించారు. మంగళవారమే బీజేపీ కండువా కప్పుకున్న సినీ నటి, మాజీ ఎంపీ అయిన జయప్రదకు రాంపూర్‌ స్థానాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు