రామనగర బీజేపీ అభ్యర్థిగా ఫైర్‌బ్రాండ్‌ ?

11 Apr, 2018 08:09 IST|Sakshi
తేజస్విని గౌడ

దొడ్డబళ్లాపురం: రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో రామనగర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్‌ తేజస్వినిగౌడ పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చెన్నపట్టణ, రామనగర రెండు నియోజక వర్గాల నుండీ పోటీ చేస్తారని ప్రకటన వెలువడడంతో బీజేపీ ఇందుకు ప్రతితంత్రంగా తమ పార్టీ నుండి తేజస్వినిగౌడను బరిలోకి దింపడానికి పావులు కదుపుతోంది. 2004లో కనకపుర స్థానం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన తేజస్వినిగౌడ తన ప్రత్యర్థి మాజీ ప్రధాని దేవెగౌడకు ఓటమి రుచి చూపించారు. ఇప్పుడు దేవెగౌడ కుమారుడు కుమారస్వామి మట్టికరిపించేందుకు తేజస్వినిగౌడ అస్త్రాన్నే ప్రయోగిస్తున్నారు. ఈ రాజకీయమంతా చెన్నపట్టణ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్‌ పథకం ప్రకారమే జరుగుతోందని తెలుస్తోంది. కుమారస్వామిని ఎలాగయినా ఓడించచేందుకు బీజేపీ కంకణం కట్టుకున్నట్టుంది.

కాంగ్రెస్‌ నుంచి డీకే సురేష్‌ ?
ఇలా ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రస్తుత కనకపుర ఎంపీ, మంత్రి డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేష్‌ రామనగర నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే వార్త వినిపిస్తోంది. ఏదిఏమయినా కుమారస్వామి ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఏమాత్రం కల్పించరాదని ప్రతినబూనిన బీజేపీ కాంగ్రెస్‌ పార్టీలు రామనగర,చెన్నపట్టణ నియోజకవర్గాలలో ఒక్క చోట కూడా కుమార స్వామి గెలవకుండా చేయాలని ఉన్న అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తున్నాయి. ఒకవేళ కుమారస్వామిపై డీకే సురేష్, తేజస్వినిగౌడ పోటీ చేస్తే రామనగర ఎన్నికలు అత్యంత రసవత్తరంగా సాగుతాయనడంలో సందేహం లేదు.

మరిన్ని వార్తలు