నవంబర్‌లో శాసనసభ ఎన్నికలు!

9 Sep, 2018 01:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఈసీ కసరత్తు 

ఓటర్ల జాబితా షెడ్యూల్‌ సవరణ

తుది జాబితా తర్వాత ఎన్నికల షెడ్యూల్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ ఏడాది నవంబర్‌లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబర్‌లోనే ఎన్నికలు జరిపేలా ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను సవరించింది. సాధారణ షెడ్యూల్‌ కంటే మూడు నెలల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2019 సాధారణ ఎన్నికల కోసం గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో ఈ మేరకు మార్పులు చేసింది. అక్టోబరు 8న ఓటర్ల తుది జాబితాను ఖరారు చేయనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ ఈ మేరకు శనివారం కొత్త షెడ్యూల్‌ జారీ చేశారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఓటరు జాబితాలో పేరు ఉన్నవారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. ఓటరు జాబితాలో పేరుతో పాటు గుర్తింపు కార్డు కూడా ఉండాలని పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతుందని రజత్‌కుమార్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఓటరు జాబితా రూపకల్పన షెడ్యూల్‌ పూర్తి కాగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత గరిష్టంగా 50 రోజులలోపు ఫలితాల ప్రకటనతో పాటు మొత్తం ప్రక్రియ పూర్తి చేయనుంది. ఓటరు జాబితా తాజా షెడ్యూల్‌ ప్రకారం చూస్తే డిసెంబర్‌ మొదటి వారంలోపే ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల జాబితా షెడ్యూల్‌లో మార్పులు చేసిన నేపథ్యంలో ఓటర్ల నమోదు విషయంలోనూ ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెస్టెంబర్‌ 15, 16 తేదీల్లో గ్రామసభలు, స్థానిక సంస్థలో ఓటరు నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.  

2018 జనవరి 1 ఆధారం... 
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్వహిస్తుంది. జనవరి 1వ తేదీ ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా షెడ్యూల్‌ ప్రక్రియలో మార్పులు జరిగాయి. పాత షెడ్యూల్‌ ప్రకారం 2019 జనవరి 1ని క్వాలిఫైయింగ్‌ తేదీగా నిర్ధారించగా, తాజా మార్పుల నేపథ్యంలో 2018 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించనున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. తాజా మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు