నేటి నుంచి అసెంబ్లీ 

18 Jul, 2019 02:27 IST|Sakshi

నేడు, రేపు శాసనసభ..  రేపు మండలి సమావేశాలు 

మున్సిపల్‌ చట్టాల బిల్లుకు లభించనున్న ఆమోదం 

సాక్షి, హైదరాబాద్‌: నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు పబ్లిక్‌ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్లో శాసనసభ సమావేశం ప్రారంభం కానుంది. పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మున్సిపల్‌ చట్టాల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన అనంతరం సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేయనున్నారు. శుక్రవారం శాసనసభలో చర్చ నిర్వహించి మున్సిపల్‌ చట్టాల బిల్లును ఆమోదించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిల్‌ హాల్‌లో శాసన మండలి సమావేశం నిర్వహించి ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. మున్సిపల్‌ చట్టాల బిల్లులతో పాటు మరో నాలుగు ఆర్డినెన్స్‌ల బిల్లులను సైతం ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ప్రధానంగా మున్సిపల్‌ చట్టాల బిల్లును ఆమోదించేందుకు శాసనసభ సమావేశాన్ని నిర్వహిస్తున్నందున ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ వంటి ప్రొసీడింగ్‌లతో సంబంధం లేకుండా కేవలం ఎజెండాలోని అంశాలపై మాత్రమే చర్చకు అనుమతించనున్నారు.

మరిన్ని వార్తలు