శాసనసభ: విమర్శలను తిప్పికొట్టిన హరీష్‌రావు

12 Mar, 2020 15:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విమర్శలను ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ వద్దుల పార్టీ అని అందుకే ప్రజలు కూడా వద్దని ఆ పార్టీని రద్దు చేశారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై ప్రజలకు నిరాశ లేదని.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులే నిరాశ చెందుతున్నారని విమర్శించారు. సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచామని ఆయన గుర్తు చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్‌రావు శాసనసభలో గురువారం మాట్లాడారు. 
(చదవండి: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు)

కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో కరెంట్‌ కోతలు, వారానికి మూడు రోజులు పవర్‌ హాలిడే ఉండేదని.. తమ ప్రభుత్వం విద్యుత్‌ సమస్యలు పూర్తిగా పరిష్కరించిందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు, రైతులకు, గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని హరీష్‌రావు తెలిపారు. రైతాంగానికి 24 గంటల కరెంటుతోపాటు పెట్టుబడి సాయంగా రూ.10 వేలు అందిస్తున్నామన్నారు. ‘కరెంటు బందు ప్రభుత్వం మీది.. రైతు బంధు ప్రభుత్వం మాది’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
(శాసనసభ: కాంగ్రెస్‌ నేతలకు సీఎం కేసీఆర్‌ క్లాస్‌!)

ఐటీ రంగంలో కూడా మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ గొప్ప అభివృద్ధి సాధించిందని ఆయన కొనియాడారు. ప్రపంచ వేదికలపై హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ గురించి మాట్లాడటం మన రాష్ట్రానికి దక్కిన గౌరవమన్నారు. డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. హైదరాబాద్‌ అభివృద్ధికి 10వేల కోట్లు కేటాయించామని చెప్పారు. తమను విమర్శించే ముందు కాంగ్రెస్‌ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హరీష్‌రావు హితవు పలికారు.
(చదవండి: ప్రైవేటుకు పరుగు)

>
మరిన్ని వార్తలు