తీర్మానం ఉపసంహరించుకునేలా ఆదేశించండి

19 Mar, 2020 02:15 IST|Sakshi
బుధవారం రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ని కలిసి వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు లక్ష్మణ్, రామచంద్రరావు, మోత్కుపల్లి నర్సింహులు, డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డి, వివేక్‌

సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానంపై గవర్నర్‌కు బీజేపీ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా సీఎం కేసీఆర్‌ను ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు రాష్ట్ర బీజేపీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్‌.రామ్‌చందర్‌రావు, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీమంత్రి డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు.

ఎన్‌పీఆర్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గవర్నర్‌ను కలసిన అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజలను తప్పుదారి పట్టించినందుకు సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పేలా చర్యలు చేపట్టాలని గవర్నర్‌ను కోరినట్లు వెల్లడించారు. ఎన్‌ఆర్‌సీపై కేంద్రం ఇంకా నిర్ణయమే తీసుకోలేదన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా చేసిన అసెంబ్లీ తీర్మానం చెల్లదని తెలిసినా, ఎంఐఎం కోసమే దాన్ని చేశారన్నారు. పాకిస్తాన్‌ ముస్లిం లకు పౌరసత్వం ఇక్కడ ఇవ్వాలని కేసీఆర్‌ అడుగుతున్నారని పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు