వ్యక్తుల కోసం జీవోల జారీ దుర్మార్గం: బండి సంజయ్‌

5 Jun, 2020 18:28 IST|Sakshi

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే వైద్యులకు కరోనా: బండి సంజయ్‌

సాక్షి, కరీంనగర్‌: కొందరు వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేయడం దుర్మార్గమని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. వైన్స్‌ కోసం కూడా ప్రత్యేక జీవోలు జారీ చేయడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిన ఘనత అని, ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం బండి సజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారడం దురదృష్టకరం. సీనియర్ లెక్చరర్, ఎక్సైజ్ సీఐల ఎక్స్‌టెన్షన్‌లకు జీవోలు జారీ చేయడం ఏంటి?. రహస్యంగా జారీ చేసిన జీవోలకు లెక్క లేదు. జారీ చేయాలనుకుంటున్న వాటికి అంతులేదు.  (సీఎం కేసీఆర్ కొత్త కుట్ర ప్రారంభించారు)

ప్రభుత్వం చేస్తున్న ఈ మోసంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పునరాలోచించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే డాక్టర్లకు కరోనా. బీజేపీ ఎంత చెప్పినా డాక్టర్లకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు పంపిణీ చేయకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది. వైద్యులను కాపాడలేని ఈ ప్రభుత్వం సామాన్యులను ఏమి కాపాడుతుంది?. మీకు చేతగాకపోతే చెప్పండి. కోవిడ్‌ ఆసుపత్రుల్లోని డాక్టర్లను మేమే కాపాడుకుంటాం. ప్రభుత్వ చేతగానితనం వల్లనే తెలంగాణలో వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుంది’  అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. (ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు : ఉత్తమ్)

నాకు ఆయన గురువులాంటివారు..
కాగా మాజీ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం బీజేపీలో చేరటాన్ని బండి సంజయ్‌ స్వాగతించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాకు ఆయన గురువులాంటి వారు. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడే ఆయన సంజయ్ విచార్ మంచ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో డైరెక్టర్‌గా నేను పోటీచేస్తే, పార్టీలకు అతీతంగా నన్ను కటకం బలపరిచారు. రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించేందుకు కటకం మృత్యుంజయం లాంటి వారి గొంతు ఎంతో అవసరం. 

కేసీఆర్‌కు తొత్తులుగా మారారు..
కేసీఆర్ కుటుంబానికి తప్ప రాష్ట్రంలో నియామకాలు లేవు. ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్‌కు తొత్తులుగా మారి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ల కుటుంబం కోసమే పదవీ విరమణ పెంపు జీవో తెప్పించారు కొందరు నేతలు. 50 శాతం జీతాలు కట్ చేసినా, ఐఆర్ ఇవ్వకపోయినా  ఈ నేతలు మాట్లాడరు. మీ స్వలాభం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులు తాకట్టు పెట్టారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మీరంతా ఎక్కడికి వెళ్లారు. నేడు ఉద్యమకారులంతా కనుమరుగు అయ్యారు. 

టెస్టులు సరిగా లేకపోవడం వల్లే కరోనా కేసులు
ఓ మద్యం షాపు కోసం జీవోలు తీసిన దగుల్బాజీ  సీఎం. ఆయన క్వారంటైన్ ముఖ్యమంత్రి. ఆరేళ్లుగా కేసీఆర్‌ బయటకే రావడం లేదు. కరీంనగర్  ఐసోలేషన్‌లో వైద్యులకు సరైన రక్షణ కల్పించకపోతే నేను రెండుసార్లు వెళ్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను. గాంధీ ఆస్పత్రి సహా అనేక ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు లేక వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. టెస్టులు సరిగా లేకపోవడం వల్లే కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. సీ ఓటర్ సర్వేలో  సీఎం కేసీఆర్‌ ర్యాంకు 16వ స్థానం. ఇక మధుసూధన్ అనే వ్యక్తి మృతి విషయంలో కోర్టు మొట్టికాయలు వేసినా స్పందించడం లేదు. కొండ పోచమ్మ చెరువు నుంచి ఒక్క ఎకరానికైనైనా నీళ్లిచ్చారా?. వర్షం పడితే పూలు చల్లి కాళేశ్వరం నీళ్ళని చెప్పుకుంటున్నారు. 

ముఖ్యమంత్రి బండారాన్ని బయట పెడుతాం. ఏ భూమిలో ఏ పంట పెడుతుందో రైతులకు మాత్రమే తెలుసు. కానీ ఫాంహౌస్‌లో ఉండి తాను చెప్పిన పంటలే వేయాలంటున్నాడు. మద్ధతు ధర ప్రకటించి, పంటలకు కలిగే నష్టాలకు పూర్తి బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి హామీ ఇవ్వాలి. ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాలేదు. నాతో సహా, మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. 100 శాతం కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయం. టీఆర్‌ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించేందుకు అందరూ ముందుకు రావాలి.’ అని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు