పోలీసుల కళ్లగప్పి.. నాటకీయంగా లక్ష్మణ్‌ దీక్ష!

29 Apr, 2019 09:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం న్యాయం చేయాలన్న డిమాండ్‌తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాటకీయ పరిణామాల నడుమ నిరాహార దీక్షకు దిగారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి తొలగించాలని, ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై న్యాయ విచారణ జరపాలంటూ ఆయన సోమవారం నుంచి నిరవధిక నిరాహాక దీక్ష చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు  ముషీరాబాద్‌లోని లక్ష్మణ్‌  క్యాంపు కార్యాలయం ముందు మోహరించారు. ఆయన బయటకు రాగానే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి ట్యాక్సీ కారులో చాకచక్యంగా ఆయన బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన వేదిక వద్ద ఆయన నిరాహార దీక్షకు దిగారు.

ఇంటర్ ఫలితాల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావిస్తోంది. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆ కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలుపకపోగా తూ.తూ.మంత్రంగా చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వార్తలు