బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?

21 Feb, 2020 04:10 IST|Sakshi

హాట్‌ టాపిక్‌గా మారిన విద్యాసాగర్‌రావు వ్యాఖ్యలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్మణ్‌ వైపే మొగ్గు

‘హిందుత్వ’ను ప్రాధాన్యంగా తీసుకుంటే సంజయ్‌కి చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం హాట్‌ టాపిక్‌గా మారింది. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసిన మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు రాబోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు అంటే ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌నే కొనసాగిస్తారా? లేదా అధ్యక్ష పదవి ఆశిస్తున్న బండి సంజయ్‌కి ఇస్తారా? అన్న చర్చ జోరందుకుంది.

దీనిపై లక్ష్మణ్‌ను వివరణ కోరగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని జాతీయ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు పార్టీకి పూర్తి స్థాయి సమయం వెచ్చించే అవకాశం లక్ష్మణ్‌కే ఉన్నందున ఆయనకే ఇస్తారన్న చర్చ జరుగుతోంది. సంజయ్‌కి ఇస్తే ఎంపీగా నియోజకవర్గంపై దృష్టి సారించడం కష్టమవుతుందని, కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ను, మంత్రులను ఎదుర్కొనే సత్తా ఉన్న నేత జిల్లో లేకుండా పోతారని, పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి సారించే పరిస్థితి ఉండదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

జాతీయ పార్టీ కనుక హిందుత్వ ఎజెండాను మాత్రమే ప్రధానంగా తీసుకుంటే సంజయ్‌కే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇటు మాజీ మంత్రి డీకే అరుణ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఆమె తన ప్రయత్నాలు ముమ్మ రంచేశారు. ఈ ముగ్గురిలో ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తారన్నది పది రోజుల్లోగా తేలనుంది. మరోవైపు వచ్చే వారం రోజుల్లో 25 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించే అవకాశం ఉందని, ఆ కసరత్తు సాగుతోందని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు

మరిన్ని వార్తలు