బండి సంజయ్‌ భయపడడు..

12 Mar, 2020 02:50 IST|Sakshi

హిందూ ధర్మం కోసం పని చేస్తా

టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం

‘సాక్షి’ఇంటర్వ్యూలో బండి సంజయ్‌

సాక్షి, న్యూఢిల్లీ: బండి సంజయ్‌ దేనికీ భయపడే వ్యక్తి కాడని, హిందూ ధర్మం కోసం పనిచేస్తూనే ఉంటానని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వూ్యలో పలు విషయాలు వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడటమే తమ ప్రస్తుత కర్తవ్యమని, పేదల అభ్యున్నతికి పాటుపడి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు.. 

సాక్షి: సీనియర్లు ఉన్నా మీకు అధ్యక్ష పదవి వచ్చింది. తెలంగాణలో బీజేపీ బండిని ఏ మేర లాగుతారు? 
సంజయ్‌: సీనియర్లందరి సాయంతో, వారి మార్గదర్శనంలో తెలంగాణలో కమల వికాసం కోసం పనిచేస్తాం. 

సాక్షి: బండి సంజయ్‌ మతానికి సంబంధించి దూకుడుగా మాట్లాడతారని, కరీంనగర్‌ వంటి ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు కారణమయ్యారని పేరుంది. ఇప్పు డు మీ వైఖరి ఎలా ఉండబోతోంది? ఎలాంటి థ్రెట్స్‌ ఉండే అవకాశం ఉంది? 
సంజయ్‌: దేనికీ భయపడే వ్యక్తి బండి సంజయ్‌ కాదు. నేను హిందువును. హిందూ ధర్మం కోసం పనిచేస్తా. దాంట్లో ఇబ్బందేమీ లేదు. ఇంకో మతాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. మైనారిటీ ఓటు బ్యాంకు కోసం, హిందూ ధర్మాన్ని అవహేళన చేసేలా ఎంఐఎం పనిచేస్తే కూడా టీఆర్‌ఎస్‌ దానికి మద్దతు పలుకుతోంది. హిందూగాళ్లూ బొందూగాళ్లూ అని ముఖ్యమంత్రే అంటున్న డు. అలాంటి విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటం. బీజేపీ 80 శాతం ఉన్న హిందువుల కోసం పోరాడితే మతతత్వ పార్టీగా చిత్రించేందుకు టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌లు.. ఒక వర్గానికే కొమ్ము కాస్తూ సెక్యులర్‌ వాదులుగా సమాజంలో చెలామణీ అవుతున్నారు.
 
సాక్షి: మీ ముందున్న తక్షణ కర్తవ్యమేంటి? ఎలాంటి సవాళ్లు మీ ముందున్నాయి? 
సంజయ్‌: టీఆర్‌ఎస్‌ బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను వంచిస్తోంది. కేంద్ర సంక్షేమ పథకాలను పేర్లు, ఫొటోలు మార్చి మోసం చేస్తోందో, కేంద్ర నిధులను ఎలా దారి మళ్లిస్తోందో ప్రజలకు వివరిస్తాం. టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటమే మా కర్తవ్యం. తెలంగాణలో కచ్చితంగా కాషాయ జెండా రెపరెపలాడేలా చేస్తాం. 

సాక్షి: బీజేపీలో గ్రూపు విభేదాలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి?
సంజయ్‌: గ్రూపులు ఉండటం అవాస్తవం. బీజేపీ ఒక వ్యక్తి నిర్ణయం మీద నడవదు. అందరం కలసికట్టుగా నిర్ణయం తీసుకునే పార్టీ. అనేక కమిటీల ద్వారా మా కార్యాచరణ ముందుకు సాగుతుంది. శక్తిమంతమైన కార్యకర్తలు ఉన్నారు. తెగించి కొట్లాడే కార్యకర్తలు ఉన్నారు. 

సాక్షి: ఉత్తర తెలంగాణలోనే బీజేపీ కన్పిస్తోందని, రాష్ట్రం మొత్తం ప్రాబల్యం తక్కువగా ఉందని విమర్శలపై ఏమంటారు? 
సంజయ్‌: అలా ఏం లేదు. మొన్న నాలుగు పార్లమెంటు స్థానాలు గెలిచాం. మున్సిపల్‌ ఎన్నికల్లో మా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేశాం. బీజేపీ కార్యకర్త లేని బూత్‌ తెలంగాణలో లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తిస్తున్నారు. వారి విశ్వాసం వమ్ము చేయకుండా అదే తరహాలో ఉద్యమాలు ఉధృతం చేస్తాం. బీజేపీలోని సీనియర్‌ నేతలు, అనుభవజ్ఞుల సలహాలతో పార్టీని బలోపేతం చేస్తాం.

చదవండి : బీజేపీ బండికి.. సంజయుడే సారథి

మరిన్ని వార్తలు