నిరుద్యోగ యువత విషయం పట్టదా!

25 Nov, 2017 02:12 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై లక్ష్మణ్‌ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ నిరుద్యోగం లేకుండా అవసరానికంటే ఎక్కువ మందికి పదవులిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ నిరుద్యోగ యువత కనిపించడంలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) కోసం వెలువరించిన జీవో 25ను సవరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికగా నియామక నోటిఫికేషన్‌ చెల్లదని తేల్చిచెప్పిందన్నారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు తప్ప.. ప్రభుత్వం ఉద్యోగాలను ఇవ్వడంలేదని విమర్శించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వాటిని కోర్టులు కొట్టివేయడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. గ్రూప్‌–1 నోటిఫికేషన్‌కు సంబంధించి 121 ఉద్యోగాల నియామకమే గందరగోళంగా మారితే, లక్ష 12 వేల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉద్యోగాల భర్తీకి కేలండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు.  

26న నిరుద్యోగ సమర భేరీ.. 
ఈ నెల 26న హైదరాబాద్‌లో నిరుద్యోగ సమర భేరీ నిర్వహిస్తామని లక్ష్మణ్‌ వెల్లడించారు. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు పూనమ్‌ మహాజన్‌ ఈ సమరభేరీకి హాజరవుతారని పేర్కొన్నారు. డిసెంబర్‌ 1న బీసీల సమస్యలపై, 2న గల్ఫ్‌ బాధితుల సమస్యలపై సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 28న హైదరాబాద్‌కు రానున్న ప్రధాన మంత్రి మోదీకి బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు స్వాగతం చెబుతారని పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు