వివాదాలకు చెక్‌

28 Jun, 2019 06:15 IST|Sakshi

విభజన సమస్యల పరిష్కారం కోసం నేడు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

బకాయిలు, విద్యుత్‌ సంస్థల వివాదాలపై చర్చలు

పరిశీలనలో షెడ్యూల్డ్‌ 9, 10 సంస్థల విభజన సమస్యలు

జూలై 3న గవర్నర్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌ల భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం మరోసారి సమావేశమై చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాల యం ప్రగతి భవన్‌ ఈ సమావేశానికి వేదిక కానుంది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గురువారం సాయంత్రమే వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రగతి భవన్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాల సంపూర్ణ వినియోగం, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, విద్యుత్‌ పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం చెల్లించుకోవాల్సిన బిల్లుల బకాయిలు, రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్డ్‌–9, 10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన తదితర అపరిష్కృత అంశాలపై ఇద్దరు సీఎంలు ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయిన ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేసీఆర్, జగన్‌లు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా సమావేశమై సుహృద్భావ వాతావరణంలో చర్చలు నిర్వహించి ఇచ్చిపుచ్చుకునే విధానంలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ, తెలంగాణ అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని, సాధ్యమైనంత త్వరగా విభజన వివాదాలను పరిష్కరించుకోవాలని సీఎంలిద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపీకు కేటాయించిన భవనాలకు సంబంధించిన వివాదం పరిష్కృతమైన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన ఏపీ సచివాలయ, అసెంబ్లీ, ఇతర భవనాలను తెలంగాణ స్వాధీనం చేసుకుంది.

పరస్పర చెల్లింపులూ జరగలేదు
ఉమ్మడి రాష్ట్రంలోని విద్యుత్‌ ప్రాజెక్టుల్లో తెలంగాణకు 53.89%, ఏపీకు 46.11% విద్యుత్‌ వాటాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడేళ్ల వరకు రెండు రాష్ట్రాలమధ్య విద్యుత్‌ వాటాల పంపకాలు జరిగాయి. పరస్పరం జరిగిన విద్యుత్‌ పంపకాలకు సంబంధించిన బిల్లులను ఇరు రాష్ట్రాలు ఒకరికి ఒకరు చెల్లించుకోవాల్సి ఉంది. ఇతర ఆర్థికపర వివాదాలు కలిపితే తెలంగాణ నుంచి రూ.5,200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని గతంలో ఏపీ ప్రభుత్వం వాదించింది. ఈ బకాయిలను చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు దివాళ తీసినట్లు ప్రకటించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం జాతీయ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ (ఎన్సీఎల్టీ)లో కేసు సైతం వేసింది. అయితే, రెండు రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన వ్యవహారాలన్నింటినీ పరిష్కరించుకున్న తర్వాత తమకే ఏపీ నుంచి బకాయిలు రావాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వివాదాల స్థితిగతులపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు ఆయా శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య తాజాగా జరగనున్న సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించే అవకాశముంది. ఈ సమావేశంలో కుదిరే అభిప్రాయం మేరకు రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఎస్‌కే జోషి, ఎల్వీ సుబ్రమణ్యంలు వచ్చే నెల 3న రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సమక్షంలో సమావేశమై తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.

నీళ్లు, విద్యుత్‌ వివాదాలు కీలకం
గోదావరి, కృష్ణా జలాల పంపకాలు, మిగులు జలాల సంపూర్ణ వినియోగంపైనే శుక్రవారం జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని అధికావర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ విద్యుత్‌ సంస్థల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిపే అవకాశముంది. తెలంగాణలో పనిచేస్తున్న 1,152 మంది ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు ఇక్కడి విద్యుత్‌ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్‌ చేయడంతో దాదాపు ఐదేళ్ల కింద ప్రారంభమైన వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్‌ డీఎం ధర్మాధికారి పరిశీలనలో ఉంది. రిలీవైన ఉద్యోగుల్లో దాదాపు 583 మంది ఏపీకి వెళ్లేందుకు ఆప్షన్లు ఇవ్వగా, మిగిలిన వారు తెలంగాణకు ఇచ్చారు. ఈ కేసులో తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులకే రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో దాదాపు రూ.240 కోట్ల వరకు ఫీజులు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం సైతం దాదాపు ఇదే మొత్తంలో ఖర్చు చేసి ఉండొచ్చని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు