సుప్రీంకు పంచాయతీ రిజర్వేషన్లు

10 Jul, 2018 12:44 IST|Sakshi
సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించేలా కోరాలని సీఎం నిర్ణయించారు.

రేపు కేబినేట్ సబ్ కమిటీ భేటీ
దీనిపై అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం కేబినేట్ సబ్ కమిటీ సమావేశం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదనపు అడ్వకేట్ జనరల్, సంబంధిత అధికారులను ఈ భేటీకి ఆహ్వానించాలని తెలిపారు. అన్ని విషయాలు చర్చించి.. పూర్వాపరాలు పరిశీలించాలన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. దాని కోసం అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీనే పిటీషన్‌ వేసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుందని ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆరోపించారు.

రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమేగాక సుప్రీంకోర్టు తీర్పునకు సైతం విరుద్ధమంటూ సంగారెడ్డి జిల్లా పోసానిపేట సర్పంచ్‌ వి. సప్నారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 396తోపాటు తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు నిబంధనలను సవాల్‌ చేస్తూ నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన ఎ. గోపాల్‌రెడ్డి మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు