ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ ఉక్కిరి బిక్కిరి

20 Mar, 2019 12:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌‘తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ వైపు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌...తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నేతలను వరుసపెట్టి కారెక్కిస్తుంటే...మరోవైపు భారతీయ జనతా పార్టీ మిగిలిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో పాటు టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి నేతలపై దృష్టి సారించింది. ఇందుకోసం రంగంలోకి దిగిన బీజేపీ కేంద్ర నాయకత్వం అసంతృప్తులు, టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎంపీలపై  కన్నేసిన కమలం వారితో చర్చలు జరుపుతోంది.  ఇందులో భాగంగా ఇప్పటికే గద్వాల్‌ జేజమ్మ డీకే అరుణ, సోయం బాబూరావు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా చేరికలు ఉంటాయని  బీజేపీ ప్రచారం చేస్తోంది. చదవండి....(బీజేపీలోకి డీకే అరుణ)

కాషాయ కండువా కప్పుకోనున్న 20మంది కాంగ్రెస్‌ నేతలు!
సుమారు 20మంది సీనియర్‌ కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలంతా బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారట. మహబూబ్‌ నగర్‌, నల్గొండ, మెదక్‌ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలంతా బీజేపీలో చేరనున్నట్లు భోగట్టా.  లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నిన్నే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ పార్టీలోకి వచ్చే నేతలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశం, గెలుపు గుర్రాలను బరిలో నిలపాలన్న ఆలోచనతో అభ్యర్థుల ఖరారులో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా ఒక్క స్థానం మినహా మిగతా స్థానాలు ఖరారు కావడం, టీఆర్‌ఎస్‌ ఈనెల 21న అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో అప్పటివరకు వేచి చూడాలా వద్దా అని ఆ పార్టీ ఆలోచిస్తోంది. టీఆర్‌ఎస్‌లో టికెట్‌ దక్కనివారికి, గెలిచే అవకాశం ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆయా స్థానాల్లో తమ సత్తా చాటాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ అప్పటివరకు వేచి చూసే అవకాశాలు ఉన్నాయి. చదవండి...(అందుకే బీజేపీలో చేరా: డీకే అరుణ)

జానారెడ్డికి రాహుల్‌ గాంధీ ఫోన్‌
ఇక ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి ... అ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్‌ ఇస్తున్నారు. వరుసపెట్టి పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఆపరేషన్‌ ఆకర్ష్‌ బారిన పడకుండా ఉన్న నాయకుల్ని కాపాడుకునే పనిలో పడ్డారు తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలు. ఇక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీ ...జానారెడ్డికి ఫోన్‌ చేసినట్లు సమాచారం. తొందరపడవద్దని, నచ్చచెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

టీఆర్‌ఎస్‌లో విలీనమే?
పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసేందుకు ఆ పార్టీని దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 19 కాగా వారిలో 14 మంది ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరితే...విలీనం ఒకటే మిగిలినట్లు. తాజాగా బుధవారం కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. చదవండి...(టీఆర్‌ఎస్‌లోకి మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే)

తాజా పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఎప్పుడు ఏ నేత పార్టీ వీడతారో...తెలియక సతమతం అవుతోంది. ఓవైపు కారు, మరోవైపు కమలం తమ పార్టీ నేతలను లాక్కుంటుంటే హస్తం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయరైంది. ఇదంతా చూస్తుంటే... కాంగ్రెస్ నుంచి వెళ్లే వాళ్ల జాబితా కాకుండా...ఆ పార్టీలో ఉండేవాళ్లు ఎంతమందో లెక్కతీస్తే సరిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు