ఎందుకిలా జరుగుతోంది?

9 Jun, 2019 06:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆ పార్టీ అధిష్టానం పట్టించుకుంటోందా? గత 4–5 నెలలుగా ఒక్కొక్కరుగా చేజారుతున్న ఎమ్మెల్యేల్లో కనీసం ఎవరినైనా పిలిపించి మాట్లాడిందా? వారికి తామున్నామని భరోసా కల్పించే ప్రయత్నం చేసిందా? 12 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లి ఏకంగా పార్టీ శాసనసభాపక్షాన్నే విలీనం చేసినా రాష్ట్ర నాయకత్వానికి ధీమా వచ్చేలా ఏమైనా చర్యలు తీసుకుంటోందా? అంటే లేదనే అంటున్నాయి గాంధీ భవన్‌ వర్గాలు. కారణమేదైనా తెలంగాణ కాంగ్రెస్‌ను హైకమాండ్‌ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హైకమాండ్‌ వ్యవహార శైలినిబట్టి చూస్తే రాజకీయంగా ఎన్నో ఆశలతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా రెండుసార్లు ఘోర పరాభవాన్ని రుచి చూపించిన రాష్ట్రం విషయంలో చేతులెత్తేసిందా అనే అనుమానం పార్టీ నేతల్లో కలుగుతోంది.

నేతల్లో భరోసా కల్పించకపోవడం వల్లే... 
పార్టీపై భరోసా లేకుండా పోతోందని టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెబుతుంటే మరి భరోసా లేనప్పుడు పార్టీ టికెట్‌ ఎలా తీసుకున్నారని ప్రశ్నించడమే తప్ప పార్టీలో వారికి అవసరమైన భరోసాను కల్పించడంలో కూడా టీపీసీసీ నాయకత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక నేతల పరిస్థితి ఇలా ఉంటే ఢిల్లీ పెద్దలు కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించకపోవడంతో పార్టీ నుంచి వెళ్లాలనుకునే వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో సమావేశమై అందరిలో భరోసా కల్పిస్తారని చెప్పినా అది జరగలేదు.

హైకమాండ్‌ దృష్టికి వెళ్తున్నాయా..? 
పార్టీ రాష్ట్రశాఖలో జరుగుతున్న పరిణామాలు హైకమాండ్‌ దృష్టికి వెళ్లడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేల విషయాన్ని ఆదిలోనే హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకమాండ్‌తో రాష్ట్ర పార్టీని సమన్వయం చేయడంలో అధిష్టానంపక్షాన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న ఆర్‌.సి.కుంతియా విఫలమయ్యారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమైన ఆయన ఎప్పటికప్పుడు హైకమాండ్‌తో టచ్‌లోకి వెళ్లకుండా వ్యవహారాలను నాన్చుతున్నారని అంటున్నారు. ప్రతి విషయంలోనూ ఇదే ధోరణితో ఆయన మొదటి నుంచీ వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర పార్టీ విషయంలో హైకమాండ్‌ను ప్రభావితం చేసే స్థాయిలో సమన్వయం చేయడం లేదనే విమర్శలు కుంతియాపై వస్తున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎపిసోడ్‌లో ఆయన చొరవ తీసుకోకపోవడం, హైకమాండ్‌కు సకాలంలో చెప్పకపోవడం, టీపీసీసీ నాయకత్వానికి మార్గదర్శనం చేయకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని కొందరు ముఖ్య నేతలు చెబుతున్నారు.

ముందే మేలుకొని ఉంటే... 
వాస్తవానికి ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోశ్, ప్రభాకర్‌ కాంగ్రెస్‌ శాసనమండలిపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చిన రోజే టీపీసీసీ నాయకత్వం, ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారి ఉండేది కాదనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. ఒక జాతీయ పార్టీ తరఫున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు పార్టీ అనుమతి లేకుండా సమావేశం కావడం, సీఎల్పీ పేరుతో తీర్మానాలు చేయడం సాంకేతికంగా చెల్లవనే వాదనను బలంగా తీసుకెళ్లడంలో విఫలం కావడం, ఈ ప్రయత్నాన్ని ఎదుర్కొనే క్రమంలో కనీస పట్టుదల లోపించడంతో ఇప్పుడు అసెంబ్లీలో వెనుక బెంచీల్లో కూర్చోవాల్సి వస్తోందని పార్టీ నేతలు వాపోతున్నారు.

మండలి సభ్యులు చేసిన తీర్మానంపై పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం ఈ పరిణామాన్ని ఢిల్లీ వరకు తమ పార్టీ నేతలు తీసుకెళ్లారో కూడా అర్థం కాలేదని, అదే జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితికి అద్దం పడుతోంది. పార్టీలో ఏం జరిగినా హైకమాండ్‌ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని ఆయన వాపోయారు. ఇప్పుడు పార్టీ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మరో పార్టీలోకి వెళ్లినా కనీసం పట్టించుకోలేదని, ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమేనని, హైకమాండ్‌ వెంటనే తాజా పరిణామాలపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు