‘చే’జారకుండా..

4 May, 2019 12:53 IST|Sakshi
వెల్దుర్తి మండలంలోని అచ్చంపేట ఎంపీటీసీగా కాంగ్రెస్‌ తరఫున పోటీచేస్తున్న వాలితో బాండుపై సంతకం తీసుకుంటున్న నాయకులు

మెదక్‌జోన్‌: కాంగ్రెస్‌ పార్టీని జంపింగ్‌ల భయం వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తదనంతరం పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా ‘కారు’ ఎక్కుతుండడం.. మాజీలు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వారి దారిని అనుసరిస్తుండడం కలవరానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో పరిషత్‌ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచాక ‘చే’జారకుండా ఉండేందుకు సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ‘గెలిచాక ఐదేళ్లపాటు పార్టీని వీడబోమంటూ.. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామంటూ.. పార్టీ మారితే అధిష్టానం తీసుకునే ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అం టూ’ బాండ్‌ పేపర్‌ రాయించుకుంటున్నారు.
 
ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతుండడంతో
జాతీయ పార్టీగా ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ పార్టీ మారిన రాజకీయ పరిణామల నేపథ్యంలో అగ్రిమెంట్‌ పార్టీగా మారింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్‌ఎస్‌ పార్టీకి మెదక్‌ జిల్లాలో తిరుగు లేకుండా పోయింది. ఉమ్మడి మెదక్‌లో పది అసెంబ్లీ  స్థానాలకు గాను 9 సీట్లు ‘గులాబీ’ పార్టీ కైవసం చేసేకోగా ఒక్కటి మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో చేరింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఉత్పన్నమైంది.

ఒక్క సంగారెడ్డి తప్ప ఉమ్మడి జిల్లాలోని 9 సీట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ నాయకులు ఒక్కరొక్కరుగా అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం ప్రారంభమైంది. మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి మొదలుకుని కొల్చారం జెడ్పీటీసీ, ఎంపీపీలు శ్రీనివాస్‌రెడ్డి, రమేష్,  జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్, ఎంపీటీసీలు, ఇటీవల గెలుపొందిన సర్పంచులతో పాటు గ్రామస్థాయి క్యాడర్‌వరకు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు దొరకని ప రిస్థితి తలెత్తింది. దీంతో కాంగ్రెస్‌ బ్యానర్‌పై గెలుపొంది అధికార పార్టీలో చేరకుండా ఉండేందుకు ఆ పార్టీ అగ్రిమెంట్‌ తీసుకువచ్చింది.
 
క్రమశిక్షణ చర్యల కోసం
కాంగ్రెస్‌ పార్టీ తరఫున చేతిగుర్తుపై పరిషత్‌ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు జిల్లాస్థాయి నాయకులు బీఫారాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపొందాక పార్టీమారితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ బాండుపేపర్‌పై రాయించుకుంటున్నారు. దీనిపై కొంతమంది కిందిస్థాయి నాయకులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. పార్టీ సింబల్‌పై గెలిచిన ఎందరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కారెక్కితే వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని, తమకు బీఫారాలు ఇచ్చేవారు మాత్రం పార్టీ మారరని గ్యారెంటీ ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈ బాండుపేపర్‌ అగ్రిమెంట్‌ ఎటువైపునకు దారితీస్తుందో వేచి చూడాలి.

బాండుపేపర్‌లో ఇలా..

  • నేను ఇండియన్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడిగా పార్టీ బీఫాం పొంది చేతిగుర్తుపై పోటీ చేస్తున్నాను
  • గెలుపొందాక ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతర పార్టీలో చేరబోను
  • పార్టీ ఆదేశాల మేరకు ఐదు సంవత్సరాల పాటు పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేస్తాను
  • గెలుపొందాక కాంగ్రెస్‌ పార్టీకే సపోర్టు చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఇతర పార్టీలకు సపోర్టు చేయను
  • ఒకవేళ పార్టీమారితే లీగల్‌గా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా  దానికి కట్టుబడి ఉంటాను. ఇది నా ఇష్టపూర్వకంగా రాసి ఇచ్చినది నిజము.

పార్టీ మారకుండా ఉండేందుకే 

ఎన్నికల్లో చేతిగుర్తుపై గెలుపొందిన నాయకులు ఆ తర్వాత అధికార పార్టీలో చేరుతున్నారు. ఇక ముందు అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అధిష్టానం ఆదేశాల మేరకు పరిషత్‌ ఎన్నికల్లో బీఫాం ఇచ్చిన కార్యకర్తలు గెలుపొందాక ఇతర పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు బాండుపేపర్‌పై రాయించుకుంటున్నాం. –కంఠారెడ్డి తిరుపతిరెడ్డి,డీసీసీ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు