‘అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్‌లో బట్టేబాజ్‌ అంటారు’

4 Oct, 2018 15:58 IST|Sakshi

సాక్షి, అలంపూర్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. గురువారం ఉదయం అలంపూర్‌ చేరుకున్న కాంగ్రెస్‌ నాయకులు జోగుళాంబ శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన సభలో సీనియర్‌ నేత జనారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేశాడని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ నియంత పాలన కొనసాగిస్తున్నారని.. ఎవరు ప్రశ్నించిన అణచివేస్తున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తుపై మాట్లాడుతున్న కేసీఆర్‌.. ఇంతకుముందు టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గమనించాలని ప్రజలను కోరారు. కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ ఇస్తే తాను టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటానని అన్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. తాను ఆ మాట అన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. 

టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్‌లో బట్టేబాజ్, దోకేబాజ్‌ అని అంటారు. తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ బట్టేబాజ్‌. గిరిజనులను, దళితులను, ఇలా అన్ని వర్గాలను మోసం చేసినందుకు కేసీఆర్‌ దోకేబాజ్‌. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందజేస్తామని హామీలు ఇచ్చారు.

కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ.. ఉద్యమాలు చేసి ఎన్నో అవమానాలు పడి నేడు తెలంగాణను దొరల పాలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల అకాంక్ష తీర్చింది యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ మాత్రమేనని అన్నారు. రాములమ్మ సినిమాలో​ రాములమ్మ ఎన్ని కష్టాలు పడిందో.. తెలంగాణలో నేడు ప్రజలు ఆ కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. తనను దేవుడిచ్చిన చెల్ల అన్న కేసీఆర్‌.. కారణం లేకుండా తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చెప్పాలన్నారు. రైతు బంధు పథకం రైతు మరణ బంధు అవుతుందని విమర్శించారు. చిన్న ఇల్లు కోసం ఆశపడి తెలంగాణను దొరలకు కట్టబెట్టామని.. ఈ పాలనకు చరమ గీతం పాడి కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ డబ్బు ఇస్తే తీసుకుని కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజలు కేసీఆర్‌కు అయిదేళ్ల అధికారం ఇస్తే నాలుగేళ్లకే పారిపోయాడని.. మళ్లీ అధికారం ఇస్తే మూడేళ్లకే పారిపోతాడని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు