కొంపముంచిన చంద్రబాబు పొత్తు

11 Dec, 2018 11:00 IST|Sakshi

సాక్షి వెబ్, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. కూటమి పేరుతో చేసిన పొత్తు రాజకీయాలు ఆ పార్టీని నిండా ముంచింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సొంత ఎజెండాతో కాకుండా ప్రజల్లో విశ్వసనీయత లేని పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉంటూ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ చివరకు సరైన ఎత్తుగడ లేక ఎన్నికల్లో చతికిలపడింది. ముందస్తు ఎన్నికలు అనివార్యమని తేలిపోయిన తర్వాత ఎంతో సమయం ఉన్నప్పటికీ తగిన వ్యూహ రచన చేయడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రధానంగా టీడీపీతో పొత్తు, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు నాయుడును ప్రచారాస్త్రంగా ఎంచుకోవడాన్ని ప్రజలు ఛీత్కరించారు. ముఖ్యంగా చంద్రబాబుతో కాంగ్రెస్ నేతల లాలూచీ వ్యవహారాలు టీఆర్ఎస్ కు మరింత బలం చేకూర్చినట్లయిందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్‌కు మొదటి నుంచి బలమైన స్థానాల్లో సైతం ఈసారి ఫలితాలు తారుమారు కావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటంలేదు.

తెలంగాణలో బలమైన స్థానాల్లో సైతం పార్టీ ప్రతికూల ఫలితాలు రావడమంటే పొత్తు ఎత్తుగడ పూర్తిగా బెడిసికొట్టినట్టు అర్థమవుతోంది. కాంగ్రెస్ ముఖ్య నాయకులు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు క్యూ కట్టడం, ఆయన ఆదేశాలకు అనుగుణంగా నాయకులు నడుచుకోవడం, చంద్రబాబుతో ప్రచారం చేయించుకోవడం వంటి అనేక పరిణామాలు ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఆశలు పెట్టుకున్న నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సైతం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనగా అలాంటి చోట్ల ప్రతికూల ఫలితాలు రావడం గమనార్హం. ఈ పరిణామాలను బట్టి చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత లేదని స్పష్టమైంది. (చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...)

తెలంగాణ ఇచ్చింది తామే అంటూ ఎన్నికలకు వెళ్లినప్పటి 2014లో ప్రజలు ఆ పార్టీని విశ్వసించలేదు. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు బాగా కలిసొచ్చింది. అయితే గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఎదురైన వాతావరణాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమైందని తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు నాయుడుతో పొత్తు సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. తెలంగాణలో ఏకైక ప్రతిపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఓటమి ద్వారా ఆ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. (ఫ్రంట్‌ పేరుతో చంద్రబాబు స్టంట్‌)

కాంగ్రెస్ ను దెబ్బతీసిన ప్రధాన అంశాలు :

  • టీడీపీతో పొత్తు
  • ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోవడం
  • విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనివ్వడం  
  • చంద్రబాబు ద్వారా సమకూరే ఆర్థిక ప్రయోజనాలకు ఆశపడటం
  • పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు సరిగా చేయలేకపోవడం
  • కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను కూడా చంద్రబాబు ఖరారు చేయడం
  • ఇతర పార్టీలతో పొత్తులు తేల్చకుండా చివరి వరకు నాన్చివేత ధోరణి అవలంభించడం
  • టీజేఎస్‌ విషయంలో బలమున్న చోట కాకుండా ఇతరత్రా కారణాలతో సీట్ల కేటాయింపు
  • ముందస్తు ఎన్నికలు అనివార్యమని తెలిసిన తర్వాత కూడా తగిన వ్యూహరచన చేయకపోవడం
  • సరైన సమయంలో మేనిఫెస్టోను విడుదల చేయకపోవడం
  • ప్రజల్లో విశ్వాసం కలిగించే రీతిలో మేనిఫెస్టో రూపకల్పన జరక్కపోవడం
  • మేనిఫెస్టోలో కొన్ని ప్రజాకర్షక పథకాలు చేర్చినప్పటికీ చంద్రబాబు కారణంగా ప్రజలు వాటిని విశ్వసించకపోవడం
  • ఎప్పటిలాగే టికెట్ల కేటాయింపులో ఢిల్లీలో రాజకీయాలు, చివరి క్షణం వరకు సాగదీత ధోరణి
  • అభ్యర్థులు ఆలస్యంగా రంగంలోకి దిగడం
  • నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, సమన్వయలోపం
  • నాయకత్వం మధ్య ఐక్యత లేకపోవడం
  • అసంతృప్త నేతలను బుజ్జగించలేకపోవడం, వారిలో తగిన భరోసా కల్పించలేకపోవడం
  • వలసలను నిరోధించలేకపోవడం
  • బలమున్న స్థానాలను ఇతర పార్టీలకు కేటాయించడం

మరిన్ని వార్తలు