రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్‌

11 Dec, 2018 07:26 IST|Sakshi

రాత్రి 9 :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారాన్ని చేపట్టనుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 88 చోట్ల విజయం సాధించి టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీ శ్రేణులతో భేటీ అయిన అనంతరం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహెందర్‌ రెడ్డి, పలువురు అధికారులు సీఎం కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.

రాత్రి 8 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. 

సాయంత్రం 7.35:  తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌ దాదాపు ముగిసింది.  ఈవీఎంలు మొరాయించడంతో ఒకటి-రెండు చోట్ల రివెరిఫికేషన్‌ కారణంగా కౌంటింగ్‌కు ఆలస్యం కానుంది.

సాయంత్రం 7.30: కోదాడ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి భార్య పద్మావతి ఓటమి చెందారు. పద్మావతిపై బొల్లం మల్లయ్య యాదవ్‌ గెలుపొందారు.

సాయంత్రం 07:00:  ఇబ్రహీంపట్నం, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు చెందిన ఈవీఎమ్‌లు మొరాయించడంతో కౌంటింగ్‌కు ఇబ్బంది. ఈ మూడు నియోజకవర్గాల్లో కౌంటింగ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.  

సాయంత్రం 06:40 : సంగారెడ్డి నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌ రెడ్డి(జగ్గారెడ్డి) 2వేల ఓట్లకు పైగా స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.  ఇప్పటివరకు 116 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ 85 స్థానాల్లో విజయం సాధించగా, మరో రెండు స్థానాల్లో ముందంజలో ఉంది. మహాకూటమి 21 స్థానాల్లో, బీజేపీ ఒక్క చోట, ఎంఐఎం ఏడు చోట్ల, స్వతంత్రులు రెండు చోట్ల విజయాలు సాధించాయి.  

సాయంత్రం 6:30:  ఎన్నికల ఫలితాల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. రౌండ్‌.. రౌండ్‌కు ఫలితాలు మారాయి. మహాకూటమి అభ్యర్థి సామ రంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిల మధ్య విజయం దోబూచులాడుతోంది. 

సాయంత్రం 06: 20:  కోదాడ నియోజకవర్గంలోని మూడు గ్రామాల ఈవీఎమ్‌ల మొరాయింపు. దీంతో వీవీప్యాట్‌ స్లిప్‌ల ఆధారంగా కౌంటింగ్‌ జరపాలని కలెక్టర్‌ నిర్ణయం. వెయ్యి ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మల్లయ్య యాదవ్‌. రీకౌంటింగ్‌ చేపట్టాలని మహాకూటమి అభ్యర్థి పద్మావతి డిమాండ్‌. 

సాయంత్రం 06:10: శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరికెపూడి గాంధీ 40వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఇక సూర్యపేటలో ఆపద్దర్మ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. మధిరలో మల్లు భట్టివిక్రమార్క 3వేల ఓట్లు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. 

సాయంత్రం 06:00: మహేశ్వరం నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్‌ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి అనూహ్యంగా పరాజయం చవిచూశారు. 

సాయంత్రం 05:50:  వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి రాములు నాయక్‌ ఘనవిజయం సాధించారు. 

సాయంత్రం 05:30: మానకొండూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి బాలకిషన్‌ ఘనవిజయం సాధించారు. కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ మరోసారి విజయాన్ని అందుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ 84 చోట్ల విజయదుందిబి మోగించగా.. మరో 3 చోట్ల ముందంజలో ఉన్నది. ఇక మహాకూటమి 19 స్థానాలలో విజయం సాధించగా.. మరో రెండు స్థానాలలో విజయం ఆధిక్యంలో ఉంది. 

సాయంత్రం 5:15: వంద స్థానాలకు పైగా ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ 83 చోట్ల విజయం సాధించగా.. మహాకూటమి 18 స్థానాల్లో, ఎంఐఎం 7 స్థానాలలో, బీజేపీ ఒక్క స్థానంలో, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. తన ఏడు స్థానాలను కాపాడుకున్నఎంఐఎం పార్టీ 

సాయంత్రం 05:00: టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు 81 స్థానాల్లో విజయం సాధించగా..మరో ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రజాకూటమి 18 స్థానాలలో గెలుపొందగా.. మరో మూడు స్థానాలలో ముందంజలో ఉంది. 

మధ్యాహ్నం 4:40: ‘కారు’ హైస్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ 76 స్థానాలలో విజయం సాధించగా.. మరో పది స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇక మహాకూటమి 16 స్థానాలలో విజయం సాధించగా.. మరో నాలుగు స్థానాలలో ఆధిక్యంలో ఉంది.  

మధ్యాహ్నం 4:20: హుజుర్‌నగర్‌లో ప్రజాకూటమి అభ్యర్థి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. మొదట వెనుకంజలో ఉన్న ఉత్తమ్‌.. చివరి రౌండ్స్‌ వచ్చేసరికి అధిక ఓట్లు సాధించి ఊపిరి పీల్చుకున్నారు. 

మధ్యాహ్నం 4:00: టీఆర్‌ఎస్‌ జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 71 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించగా.. మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాకూటమి 19 స్థానాల్లో గెలుపొందగా.. 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

మధ్యాహ్నం 3:30: గోషామహల్‌ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ ఘన విజయం సాధించారు. ఆంధోల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్రాంతి కిరణ్‌ విజయం సాధించారు. ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌ విజయ దుందుబి మోగించారు. 

మధ్యాహ్నం 3:20: మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన టీఆర్‌ఎస్‌. ఇప్పటివరకు 65 స్ధానాలలో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. మరో 22 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని ఓటమి దిశగా పయనమవుతున్నారు.   

మధ్యాహ్నం 3:00: కారు జోరు కోనసాగుతోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ 56 స్థానాలలో విజయదుందిబి మోగించగా.. మరో 32 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ప్రజాకూటమి 15 స్థానాలలో విజయం సాధించగా.. మరో 6 స్ధానాలలో ఆధిక్యంలో ఉంది. 

మధ్యాహ్నం 2:40 : మంథని నియోజకవర్గంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఘన విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధుపై 15,988 ఓట్ల మెజారిటీతో శ్రీధర్‌బాబు విజయదుందిబి మోగించారు. రామగుండంలో టీఆర్‌ఎస్‌ రెబల్‌ కోరుకంటి చందర్‌ ఘనవిజయం.

మధ్యాహ్నం 2:30: తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్‌, భూపాల్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మధుసుదనాచారి తన సమీప ప్రత్యర్థి ప్రజాకూటమికి చెందిన గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఘోర ఓటమి. మొత్తం ఫలితాల్లో 47 స్థానాలలో టీఆర్‌ఎస్‌ గెలుపొందగా.. 40 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇక ప్రజాకూటమి 11 స్థానాలలో గెలుపొందగా, మరో 11 స్ధానాలలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెండు స్ధానాలలో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం మూడు స్ధానాలలో గెలపొందగా.. మరో మూడు స్ధానాలలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో గెలవగా మరో స్ధానంలో ఆధిక్యంలో ఉంది.

మధ్యాహ్నం 2:15 : నల్గొండలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. నల్గొండ ప్రజాకూటమి అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో కోమటిరెడ్డి అనూహ్య పరాజయం.

మధ్యాహ్నం 2:10: గజ్వేల్‌లో గులాబీ దళపతి కేసీఆర్‌ 51,515 ఓట్ల మెజారిటీతో తన సమీప అభ్యర్థి ప్రజాకూటమికి చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డిపై  ఘన విజయం సాధించారు. 

మధ్యాహ్నం 2 : కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డికి షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. ఇక కొన్నిచోట్ల టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలి.. టీఆర్‌ఎస్‌ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర రావు, మహేందర్‌ రెడ్డి ఓటమి చెందగా.. మరో మంత్రి జగదీష్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. మొత్తంగా ఈ ఫలితాల్లో కారు ఇప్పటికే 32స్థానాల్లో జెండా ఎగురవేయగా.. మరో 54స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ నాలుగు స్థానాల్లో గెలుపొంది.. 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎమ్‌ఐఎమ్‌ మూడు స్థానాల్లో గెలుపొంది.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెండు స్థానాల్లో, ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. 

మధ్యాహ్నం 1:30 : టీఆర్‌ఎస్‌ మంత్రులు తుమ్మల, జూపల్లి ఓటమి పాలవ్వగా.. సనత్‌నగర్‌లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటికి టీఆర్‌ఎస్‌ 28స్ధానాల్లో గెలుపొంది.. 58స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో విజయం సాధించి.. 19స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెండు స్థానాల్లో, ఎమ్ఐఎమ్‌ మూడు స్థానాల్లో గెలిచి, మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. 

మధ్యాహ్నం 1 : కారు వేగంగా దూసుకుపోతున్నా..కొన్నిచోట్ల దెబ్బతగులుతోంది. కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌ రెడ్డి చేతిలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఓటమిపాలయ్యారు. మరో మంత్రి జగదీష్‌రెడ్డి కూడా వెనుకంజలో ఉన్నారు. ఇది మాత్రం టీఆర్‌ఎస్‌కు షాకే. అయినా మిగతా చోట్ల కారు దూసుకెళ్తోంది. మరోవైపు నోముల నర్సింహయ్య కాంగ్రెస్‌ అగ్రనేత జానారెడ్డిని ఓడించారు. రేవంత్‌ రెడ్డి, డీకే అరుణలాంటి నేతల ఓటమి కూడా దాదాపు ఖరారైపోయింది. ఇప్పటికే 24స్థానాల్లో గెలుపొందగా.. 62స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఇక ఈ రేసులో మొదటినుంచి వెనుకబడిఉన్న కాంగ్రెస్‌ 4 స్థానాల్లో గెలుపొంది.. 19స్థానాల్లో ముందంజలో ఉంది. ఎమ్‌ఐఎమ్‌ మూడు స్థానాల్లో గెలుపొంది.. మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెండు స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో గెలవగా.. మరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. 

మధ్యాహ్నం 12:30 : హరీష్‌ రావు తిరిగిలేని మెజార్టీతో తన సత్తాను చాటుకున్నారు.మరోవైపు కేటీఆర్‌ 70వేలు, కేసీఆర్‌ 40వేల మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్‌ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. అన్ని చోట్లా కారు హవా వీస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు జానారెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డిలు ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఇప్పటికి 11 స్థానాల్లో గెలుపొందగా 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఒక స్థానంలో గెలుపొందింది. ఎమ్‌ఐఎమ్‌ రెండు చోట్ల గెలుపొందగా.. 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

మధ్యాహ్నం 12 : హరీష్‌ రావు రికార్డు సృష్టించారు. సిద్దిపేటలో హరీష్‌ను ప్రజలు రికార్డుస్థాయి మెజార్టీతో గెలిపించారు. హరీష్‌ రావు లక్షకు పైగా మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మరోవైపు  కారు వేగంగా ఎవరికి అందనంత స్పీడులో వెళ్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు డీలా పడ్డారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు జానారెడ్డి, రేవంత్‌ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి, దామోదర రాజనర్సింహా, పొన్నాల లక్ష్మయ్య ఓటమి దిశగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ ఇప్పటివరకు ఖాతా తెరవకపోగా.. టీఆర్‌ఎస్‌ పరకాల, జుక్కల్‌, కంటోన్మెంట్‌, సిద్దిపేట, జగిత్యాల, వర్దన్నపేట, కోరుట్ల, స్థానాల్లో విజయం సాధించింది. ఇక టీఆర్‌ఎస్‌ హవాకు ఎదరులేనట్టు కనిపిస్తోంది. ఇప్పటికి టీఆర్‌ఎస్‌ 85, కాంగ్రెస్‌ 17, ఎమ్‌ఐఎమ్‌ 5, బీజేపీ ఒకటి, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

ఉదయం 11:30 : టీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. సిద్దిపేటలో హరీష్‌ రావు దాదాపు 80వేల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఇప్పటికి 86స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఏడుగురు అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్‌ 19స్థానాల్లో, ఎమ్‌ఐఎమ్‌ 4, బీజేపీ , ఇతరులు ఒక్కోస్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు.  

ఉదయం 11 : కంటోన్మెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాయన్న 12వేల మెజార్టీతో గెలుపొందారు. వర్ధన్న పేటలో ఆరూరి రమేష్‌ గెలుపొందారు. ఇప్పటికి ముగ్గురు అభ్యర్థుల విజయం ఖరారు కాగా.. 93స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. నకిరేకల్‌లో మూడో రౌండ్‌ పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్‌(వేముల వీరేశం) ఒక్క ఓటు ఆధిక్యంలో ఉంది. మరోవైపు కేసీఆర్‌, హరీష్‌ రావు, కేటీఆర్‌లు భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండగా.. కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి,గీతారెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలాంటి నేతలు ఇప్పటికీ వెనుకంజలో ఉన్నారు. ఇప్పటికి టీఆర్‌ఎస్‌ 95స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌ 14, ఎమ్‌ఐఎమ్‌ 5, బీజేపీ 2, ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలోఉన్నారు. 

ఉదయం 10:30 : కారు జోరుకు బ్రేకులు పడటం లేదు. జీవన్‌ రెడ్డిని ఓడగొట్టి బోణీ కొట్టిన టీఆర్‌ఎస్‌.. ప్రస్తుతం 91స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కారు ఏమాత్రం వెనదిరగకుండా దూసుకుపోతోంది. అన్ని చోట్లా అభ్యర్థులు దుమ్ముదులుపుతున్నారు. సిద్దిపేటలో హరీష్‌ రావు 40వేలు, సిరిసిల్లలో కేటీఆర్‌ 20వేల ఆధిక్యంలో ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఏమాత్రం ముందుకురాలేకపోతున్నారు. ఇప్పటికీ రేవంత్‌ రెడ్డి, గీతారెడ్డి, జీవన్‌ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్కలు డీలా పడ్డారు. ఇప్పటికి కాంగ్రెస్‌ 15స్థానాల్లో, ఎమ్‌ఐఎమ్‌ 5, బీజేపీ 3, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

ఉదయం 10 : కాంగ్రెస్‌కు భంగపాటు తప్పేట్టు లేదనిపిస్తోంది. కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి పరాజయం పొందారు. జగిత్యాలలో సంజయ్‌ కుమార్‌(టీఆర్‌ఎస్‌) చేతుల్లో ఓటమిపాలయ్యారు. ఇప్పటికి టీఆర్‌ఎస్‌ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఒక్క స్థానం గెలిచి బోణి కొట్టింది. కాంగ్రెస్‌ హేమాహేమీలు ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, జీవన్‌ రెడ్డిలాంటి నేతలు వెనకంజలో ఉన్నారు. మరోవైపు ఎవరూ ఆపలేనంత వేగంతో కారు దూసుకెళ్తోంది. అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ సత్తా చాటుతోంది. దాదాపు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాల్లో తేలుతున్నారు. కారు జోరుకు కూటమి డీలా పడిపోయింది.కాంగ్రెస్‌ 16, ఎమ్‌ఐఎమ్‌ 5, బీజేపీ 4, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రన్‌ ఎమ్‌ఐఎమ్‌ కొట్టేసింది. చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్‌ ఓవైసీ గెలుపొందారు. 

ఉదయం 9:30 : కాంగ్రెస్‌కు అన్నిచోట్లా ఎదురుదెబ్బ తగులుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు. హుజుర్‌నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా వెనుకబడ్డారు. ఇప్పటికి టీఆర్‌ఎస్‌ 85, కాంగ్రెస్‌ 14, ఎమ్‌ఐఎమ్‌, బీజేపీ నాలుగు స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రధాన అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు.  పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, రేవంత్‌ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క లాంటి నేతలు వెనుకబడ్డారు. టీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. కూకట్‌పల్లి, బెల్లంపల్లి, చెన్నూర్‌, వైరా, శేరిలింగంపల్లి, నకిరేకల్‌, వనపర్తిలో టీఆర్‌ఎస్‌..  పరిగి, సూర్యాపేట్‌, తుంగతుర్తి, హుజుర్‌నగర్‌, భూపాలపల్లిలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. 

ఉదయం 9 : కొండగల్‌లో రేవంత్‌రెడ్డి వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్‌లో కూడా డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు.  కారును వెంటాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ కూడా హైస్పీడ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికి టీఆర్‌ఎస్‌ 75, కాంగ్రెస్‌ 22, బీజేపీ 3, ఎమ్ఐఎమ్‌ ఒక్కస్థానంలో ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, దానం నాగేందర్‌, సూర్యాపేటలో దామోదర్‌ రెడ్డి దూసుకుపోతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో మల్‌ రెడ్డి రంగారెడ్డి , పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు, కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ,  పరకాలలో చల్లా ధర్మారెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి దూసుకుపోతున్నారు.   

ఉదయం 8:30 : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు కారు వేగంగా దూసుకుపోతోంది. వేగం పెంచేసి 21స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. అలాగే కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇకముందు ఎవరు ఆధిక్యంలో ఉండనున్నారు..ఎవరు గెలవనున్నారో తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో 9218 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి. మక్తల్‌, సిరిసిల్ల, తుంగతుర్తి, సూర్యాపేట్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల ఆధిక్యంలో ఉంది. వరంగల్‌ పశ్చిమలో మొదటి రౌండ్‌ పూర్తయ్యేసరికి 3022 ఓట్లతో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. 

ఉదయం 8 : తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఏ పార్టీ ఆధిక్యంలో ఉండనుందో, ఏ పార్టీ గెలవనుందో వీటన్నంటికి చెక్‌పడనుంది. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు. అరగం‍టపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ ఒక్కో​ స్థానంలో ఆధిక్యంలో ఉంది.  

ఉదయం 7:30 : తెలంగాణలో ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. నేడు ఎవరు పీఠాన్ని అదిష్టంచనున్నారో తెలియనుంది. ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో మొదలవ్వనుండగా.. అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికివారే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరి ధీమా నిజం కానుందో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లను పూర్తి చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 42 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా, అత్యల్పంగా భద్రాచలం, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో 12 రౌండ్లలో జరగనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు