తెలంగాణ కాంగ్రెస్‌ కథ ఢిల్లీ టు అమరావతి!

10 Nov, 2018 00:59 IST|Sakshi

అభ్యర్థుల జాబితాతో నేడు చంద్రబాబును కలవనున్న గెహ్లాట్‌

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌ కథ ఢిల్లీ నుంచి అమరావతికి చేరుతోంది! కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిన పార్టీ అభ్యర్థుల జాబితాను తీసుకుని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ శనివారం ఢిల్లీ నుంచి అమరావతి వెళ్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఖర్చును పూర్తిగా తానే భరిస్తానని కాంగ్రెస్‌ అధిష్టానానికి టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను చంద్రబాబుకు చూపించి, ఆయన అభిప్రాయం తీసుకోవడానికే గెహ్లాట్‌ అమరావతి వెళ్తున్నట్టు తెలుస్తోంది.

ప్రధానంగా కాంగ్రెస్‌ జాబితాలో ఇంకా ఖరారు కాని 19 స్థానాలపై చంద్రబాబుతో గెహ్లాట్‌ చర్చించ నున్నట్టు సమాచారం. అలాగే ఇప్పటికే ఖరారైన 74 మంది అభ్యర్థుల జాబితాపైనా మరోసారి బాబుతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. గెహ్లాట్‌ అమరావతి పర్యటన నేపథ్యంలో 74 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలిజాబితాను ముందుగా చెప్పినట్టు శనివారం విడుదల చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గల్ఫ్‌ పర్యటనలో ఉన్న నేపథ్యంలో గెహ్లాట్, చంద్రబాబు పర్యటనపై పార్టీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

టీ కాంగ్రెస్‌ నేతల విస్మయం... 
పార్టీ అభ్యర్థుల జాబితాతో గెహ్లాట్‌ అమరావతి వెళ్తున్న విషయం తెలిసి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విస్మయం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని టీవీల ద్వారా తెలుసుకున్న నేతలు.. ఢిల్లీకి ఫోన్లు చేసి గెహ్లాట్‌ అమరావతి పర్యటనపై ఆరా తీశారు. జాబితాలో చంద్రబాబు మార్పులు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్‌ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. టీడీపీతో పొత్తు ఎన్నికల్లో కొంప ముంచుతుందేమోనని ఇప్పటికే ఆందోళన చెందుతున్న సమయంలో గెహ్లాట్‌ పర్యటన మరింత చేటు చేస్తుందని ఓ సీనియర్‌ నేత ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి కేటాయించిన సీట్ల విషయంలోనూ చివరి నిమిషంలో మార్పులు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌తోపాటు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు స్థానాలు ప్రస్తుతం కాంగ్రెస్‌ ఖాతాలో ఉన్నాయి. వాటిని టీడీపీకి కేటాయిస్తూ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవచ్చని ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శనివారం నాటి గెహ్లాట్, చంద్రబాబు చర్చల్లో వీటిపై స్పష్టత వస్తుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. 

రేవంత్‌ అసంతృప్తి... 
తనతోపాటు టికెట్‌ హామీతో పార్టీలో చేరినవారికి జాబితాలో చోటు దక్కకపోవడంపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలోనే ఉన్న రేవంత్‌ శుక్రవారం సాయంత్రం స్క్రీనింగ్‌ కమిటీతో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల జాబితాతో గెహ్లాట్‌ అమరావతి పర్యటన ఖరారు కావడం గమనార్హం.  

మరిన్ని వార్తలు