కూటమి కథ క్లైమాక్స్‌కు..

17 Nov, 2018 01:09 IST|Sakshi

ఎట్టి పరిస్థితుల్లోనూ నేడు తుది జాబితాలు ప్రకటించాలని యోచన 

ఢిల్లీ వెళ్లొచ్చిన కోదండరాం 

టీజేఎస్‌ అధినేతతో ఉత్తమ్‌ భేటీ.. నేడు మరోసారి చర్చలు 

కాంగ్రెస్‌కే ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌ సీట్లు

వాటికి బదులుగా టీడీపీకి హుజూరాబాద్, పటాన్‌చెరు 

రాజేంద్రనగర్‌ నుంచి బండ్ల గణేశ్‌కు అవకాశం! 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి కథ క్లై్లమాక్స్‌కు చేరుతోంది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐలతో సీట్ల సర్దు బాటు వ్యవ హారం దాదాపుగా తుది అంకానికి వచ్చింది. నామినేషన్ల ఘట్టానికి ఇక 3రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌ స్థానాల అభ్యర్థుల ఎంపికను శనివారం పూర్తిచేయాలని ఆయా పార్టీలు కృత నిశ్చయంతో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు కాంగ్రెస్‌ 75 మందిని, టీడీపీ 12 మందిని, సీపీఐ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలిన 29 స్థానాల్లో 19 చోట్ల కాంగ్రెస్, 8 స్థానాల్లో టీజేఎస్, రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించడానికి శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్, టీజేఎస్‌ నేతలు భేటీ అయ్యారు. ఐదు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్‌ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ వచ్చారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో టీజేఎస్‌ కార్యాలయానికి వెళ్లి కోదండ రాంతో చర్చలు జరిపారు. అవి కొలిక్కి రాకపోవడంతో శనివారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. 

జనగామ, మిర్యాలగూడపై వీడని ప్రతిష్టంభన.. 
పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు 8 స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించింది. అయితే, తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల టీజేఎస్‌ నేతలు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ వెళ్లి, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ వచ్చిన టీజేఎస్‌ అధినేత కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. తమకు కేటాయించిన 8 స్థానాల్లో ఆరింటిలోనే స్పష్టత వచ్చిందని, మిగిలిన స్థానాల గురించి కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, ఢిల్లీలో ఆయన ఎవరిని కలిశారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. మరోవైపు జనగామ, మిర్యాలగూడ సీట్ల విషయంలో కాంగ్రెస్‌–టీజేఎస్‌ల మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. జనగామ నుంచి కోదండరాం పోటీచేయాలని యోచిస్తుండగా, అక్కడ కాంగ్రెస్‌ నుంచి పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య టికెట్‌ ఆశిస్తున్నారు.

తన స్థానాన్ని టీజేఎస్‌కు ఇస్తున్నారనే సమాచారం వచ్చిన వెంటనే పొన్నాల మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి అక్కడే మకాం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు పార్టీ పెద్దలను కలిసి టికెట్‌ విషయంలో తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, గురువారం అర్ధరాత్రి కోదండరాంతో జరిగిన చర్చల్లోనూ జనగామ విషయం ఏమీ తేలలేదని తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం జనగామ బరి నుంచి కోదండరాం తప్పుకుంటున్నారని, అక్కడ పొన్నాలకు లైన్‌ క్లియర్‌ అయిందని అంటున్నాయి. ఇక, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి మిర్యాలగూడ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ స్థానం కూడా తమకు కావాలని టీజేఎస్‌ పట్టుపడుతోంది. అయితే, ఈ వ్యవహారంపై రఘువీర్‌తో రాహుల్‌ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో తెలియకపోయినప్పటికీ, రాహుల్‌తో భేటీ తర్వాత తన నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేయాలని రఘువీర్‌ హైదరాబాద్‌లోని తన అనుచరులకు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో రఘువీర్‌కు టికెట్‌ ఇవ్వడం సాధ్యం కానందునే రాహుల్‌ పిలిపించి మాట్లాడి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒకవేళ రఘువీర్‌కు టికెట్‌ ఇవ్వకపోతే ఆ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయిస్తారా, కాంగ్రెస్‌కు ఇస్తారా... కాంగ్రెస్‌కు ఇస్తే ఇటీవలే పార్టీలో చేరిన అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డికి అవకాశం ఇస్తారా..? టీజేఎస్‌కు వదిలిపెడితే విద్యాధర్‌రెడ్డి పోటీచేస్తారా.. లేదంటే కొత్తగా తెరపైకి వచ్చిన జానారెడ్డి బంధువు విజయేందర్‌రెడ్డికి టికెట్‌ కేటాయిస్తారా అనే విషయాలు శనివారం తేలనున్నాయి. అలాగే జనగామలో కోదండరాం పోటీచేస్తారా లేక పొన్నాల బరిలో ఉంటారా అనే సస్పెన్స్‌కు కూడా నేడు తెరపడనుంది. 19 స్థానాలతో కూడిన కాంగ్రెస్‌ పెండింగ్‌ జాబితా కూడా శనివారం విడుదల కానుంది. 

అవి ఇటు.. ఇవి అటు.. 
తెలుగుదేశం పార్టీ పెండింగ్‌ స్థానాలపైనా ఢిల్లీలో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. టీడీపికి కేటాయించిన 14 స్థానాల్లో 12 చోట్ల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మరో రెండు స్థానాలను ప్రకటించాల్సి ఉంది. అయితే, టీడీపీ ఇప్పటికే ప్రకటించిన ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలను తిరిగి కాంగ్రెస్‌కు ఇచ్చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. వీటికి బదులుగా హుజూరాబాద్, పఠాన్‌చెరు స్థానాలను టీడీపీకి ఇస్తారని అంటున్నారు. ఈ సర్దుబాటు జరిగినప్పటికీ మరో రెండు స్థానాలు టీడీపీకి ప్రకటించాల్సి ఉంటుంది. అవి ఏమిటనేది కూడా శనివారమే తేలనుంది. ఇక టీడీపీ తిరిగి ఇచ్చే ఇబ్రహీంపట్నం సీటును మల్‌రెడ్డి రంగారెడ్డికి, రాజేంద్రనగర్‌ స్థానాన్ని సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు కేటాయించే అవకాశముందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు కూకట్‌పల్లి సీటు ఆశించిన పెద్దిరెడ్డికి హుజూరాబాద్‌ స్థానం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. అయితే, అక్కడి నుంచి సైకిల్‌ గుర్తుపై పోటీ చేయడానికి పెద్దిరెడ్డి నిరాకరించినట్టు సమాచారం. ఒకవేళ పెద్దిరెడ్డి అక్కడ నుంచి బరిలో దిగకపోతే ఆ స్థానం తిరిగి కాంగ్రెస్‌ ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ స్థానం నుంచి రేసులో ఉన్న పాడి కౌశిక్‌రెడ్డికి లైన్‌ క్లియర్‌ అయినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి అక్కడ కా>ంగ్రెస్‌ నుంచి ప్రధానంగా కౌశిక్‌రెడ్డి పేరే వినిపించినప్పటికీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బంధువు అనే కారణంతో ఆయన పేరు పెండింగ్‌లో ఉంచారు. 

ఐదు నియోజకవర్గాల ఆశావహులతో రాహుల్‌ భేటీ... 
కాంగ్రెస్‌ పెండింగ్‌లో ఉంచిన 19 స్థానాల్లో పీటముడి పడి ఉన్న ఐదు నియోజకవర్గాల నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. తుంగతుర్తి సీటు ఆశిస్తున్న అద్దంకి దయాకర్, డాక్టర్‌ వడ్డేపల్లి రవి, మిర్యాలగూడ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, ఇల్లెందు నుంచి బాణోతు హరిప్రియ, హుజూరాబాద్‌ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, బోధ్‌ నుంచి అనిల్‌జాదవ్‌ రాహుల్‌తో భేటీలో పాల్గొన్నారు. ఒక్కో నేతతో విడివిడిగా సమావేశమైన ఆయన.. సీట్ల కేటాయింపులో ఉన్న సమస్యలను వారితో చర్చించారు. ఎవరికి టికెట్‌ వచ్చినా అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, సీటు వస్తుందా లేదా అన్నది మాత్రం రాహుల్‌ చెప్పలేదు. దీంతో తమకు సీటు వస్తుందా లేదా అన్నది తేలకపోవడంతో వారంతా జాబితా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.  

మరిన్ని వార్తలు