ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారు: రేవంత్‌

24 Nov, 2018 08:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘గెలిపిస్తే సేవ.. లేకుంటే వ్రిశ్రాంతి’  అని పేర్కొన్న తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌ మాటలను ప్రజలు నమ్మవద్దని ప్రజాకూటమి నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం మేడ్చల్‌లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజా కూటమి నేతలు నిప్పులు చెరిగారు. ఇంకా ప్రజా కూటమి నేతల ఏమన్నారంటే..  

కేసీఆర్‌ మాటలపై అప్రమత్తంగా ఉండాలి- రేవంత్‌
‘నన్ను ఓడిస్తే ఫాంహౌస్‌లో పడుకుంటానని కేసీఆర్‌ అంటున్నడు. మరోపక్క నేను అమెరికాకు పోతానని కేటీఆర్‌ అంటున్నడు. కేసీఆర్‌ మాటలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా, ప్రజలతో ఉండేది కాంగ్రెస్‌ మాత్రమే. 2004లో రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంట్, ఉద్యోగాలు, ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. కానీ కేసీఆర్‌ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వలేదు, దళితులకు మూడెకరాలు, రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటాన్ని, ఆత్మబలిదానాలను గుర్తించి సోనియా రాష్ట్రం ఇస్తే, ఆ రాష్ట్రంలో సీఎం అయిన కేసీఆర్‌ ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారు. అటువంటి కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలి    

అమ్మా.. నీ రుణం తీర్చుకుంటాం- భట్టి విక్రమార్క 
తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కలను సోనియా నిజం చేశారు. తెలంగాణలోని వనరులన్నీ నాలుగు కోట్ల ప్రజలకు సమానంగా పంచాలనే ఆలోచనతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. సోనియమ్మ రుణాన్ని ఏ రకంగా తీర్చుకున్నా తక్కువేనని, అయితే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి కొంతలోకొంత రుణాన్ని తీర్చుకుంటాం. ఎందరో ఆగ్రహాల్ని చల్లార్చి తెలంగాణకు విముక్తి కలిగించారు. మీ రుణం తీర్చుకుంటామని కార్తీక పౌర్ణమిన శపథం చేస్తున్నాం. నిర్బంధాలు, ఆంక్షలు, ఎన్‌కౌంటర్లు, అవినీతి లేని తెలంగాణ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం  
    
కేసీఆర్‌కు ఓటేస్తే బురదగుంటలో వేసినట్లే- కోదండరాం
తనకు ఓటేయకుంటే ఫాంహౌస్‌లో రెస్ట్‌ తీసుకుంటా అని కేసీఆర్‌ అంటున్నడు. ఆయనకు ఓటేసినా, వేయకున్నా ఫాంహౌస్‌లోనే పడుకుంటడు. ఎటుదిరిగి ఫాంహౌస్‌కి వెళ్లే కేసీఆర్‌కి ఓటేసి వృథా. టీఆర్‌ఎస్‌కి ఓటేస్తే బురదగుంటలో వేసినట్లే. అలాంటి ఓటు వృథా పోకూడదంటే ప్రజలందరూ కూటమికి ఓటెయ్యాలి. ఈ నియంతృత్వ, నిరంకుశ పాలనకు సమాధి కట్టాలి. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క పక్షానికి మంచి జరుగలేదు. నిరుద్యోగులను వంచించారు. నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. రైతులకు బేడీలు వేశారు. ఇసుక మాఫీయాపై తిరగబడ్డ దళితులను అరెస్ట్‌ చేశారు. ఈ నియంతృత్వ పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. వాటికి లొంగకుండా మీ కోసం పనిచేసే కూటమి పక్షాన నిలవాలని కోరుతున్నా.      

ఓటమి ఖాయమని కేసీఆర్‌కు తెలిసిపోయింది- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
100 సీట్లు గెలుస్తానన్న కేసీఆర్‌ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతే ఫాంహౌస్‌కు పోతా అంటున్నరు. 15 రోజుల ముందే తెలంగాణ తీర్పు కేసీఆర్‌కు అర్థమైంది. ఓటమి ఖాయమని తెలిసిపోయింది. అందుకే ఫింఛన్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్‌ మేనిఫెస్టోని కాపీ కొడుతున్నరు. కేసీఆర్‌ పాలనలో వేల కోట్లు దోచుకున్నడు. ఆ డబ్బుతో గెలవాలని చూస్తున్నడు. ఎంత డబ్బు పంచినా కాంగ్రెస్‌ గెలుపు ఖాయం.                                     

ప్రజాకంటక పాలనను తరిమికొట్టాలి- ఆర్‌.కృష్ణయ్య
తెలంగాణ ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం కాదు కదా.. ఊరికో ఉద్యోగం రాలేదు. మేము చదువుకుంటమని బడుగు, బలహీన వర్గాలు అంటుంటే, మీరు గొర్లు, బర్ల కాడికి పోవాలని, చేపలు పట్టాలని కేసీఆర్‌ అంటుండు. ఇటువంటి ప్రజా కంటక పాలనను తరిమికొట్టాలి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు రాహుల్‌ సమ్మతించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టేందుకు, చట్టసభల్లో రాజ్యాధికారం ఇచ్చేందుకు అంగీకరించారు. బీసీలు, ఇతర వర్గాలన్నీ కూటమి పక్షాన ఉండాలి.     

కేసీఆర్‌ పారిపోతున్నడు- చాడ వెంకట్‌రెడ్డి 
సోనియా పుణ్యంతోనే తెలంగాణ ఏర్పడింది. వచ్చిన తెలంగాణ గడీల పాలైంది. నియంతృత్వ, నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్య పాలనకు పాతరేశారు. ఈ ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసమేనని కేసీఆర్‌ అంటున్నరంటే ఆయన పారిపోతున్నడు అని తెలుస్తోంది. డిసెంబర్‌ 11తో కూటమి ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఈ కూటమే డిసెంబర్‌ 11న అధికారంలోకి వచ్చేలా.. కేసీఆర్‌ను పారదోలేలా ప్రజలంతా కంకణబద్ధులు కావాలి.    

మరిన్ని వార్తలు