బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారు: ఇంటి పార్టీ

14 Nov, 2018 13:54 IST|Sakshi
చెరకు సుధాకర్‌

హైదరాబాద్‌: మహా కూటమి తరపున తెలంగాణ ఇంటి పార్టీకి సీట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని, ఇంటి పార్టీని మొదటి నుంచి దూరం చేయాలని చూశారని ఆరోపించారు. కూటమిలో ఉద్యమకారులకు ద్రోహం జరిగిందన్నారు. తాము మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలో రెండు సీట్లు అడిగామని వెల్లడించారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారని ఆరోపించారు. కూటమి సీట్లలో సామాజిక న్యాయమే లేదని వ్యాక్యానించారు. సీట్ల జాప్యానికి కోదండరాం, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలే కారణమన్నారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో తాను పోటీ చేయదలచుకున్నానని తెలిపారు. ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా మోసం చేసిందని విమర్శించారు. ఆర్ధిక సమానత్వం కోసం పోరాటం చేయాల్సి ఉందన్నారు.

ఇంటి పార్టీ నేత జస్టిస్‌ చంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం సామాజిక, ఆర్ధిక న్యాయం దొరకడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిందెవరని ప్రశ్నించారు. త్యాగాలు ఒకరివి భోగాలు మరొకరికి చేరుతున్నాయన్నారు. ఎదుగుతున్న బీసీ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, చెరకు సుధాకర్లకు సీట్లు ఇవ్వలేదని విమర్శించారు. సీపీఐ, కాంగ్రెస్‌, టీజేఎస్‌ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుల చేతిలో ఉన్నాయని, సామాజిక న్యాయం చేయని వారికి తమ మద్ధుతు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. తెలంగాణ ఇంటి పార్టీ ఉద్యమ కారులకు అండగా ఉంటుందని, మంచి కూటమితో ముందుకు వస్తామని తెలిపారు. డబ్బులు, మద్యానికి లొంగకుండా ప్రజలు ఓటు వేయాలని కోరారు. అంతకుముందు తెలంగాణ ఇంటి పార్టీ ఆద్వర్యంలో అమరుల స్థూపానికి చెరకు సుధాకర్, చంద్రకుమార్‌లు నివాళులు అర్పించారు.
 

మరిన్ని వార్తలు