12 స్థానాల్లో పోటీ చేస్తాం: టీజేఎస్‌

14 Nov, 2018 18:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలో సీట్ల పంపకంలో గందరగోళం కొనసాగుతుంది. తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ప్రకటించింది. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. టీజేఎస్ కార్యాలయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పిఎల్ విశ్వేశ్వర రావు తాము పోటీ చేసే నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజిగిరి, అంబర్ పేట, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ నుంచి పోటీకి దిగనున్నట్టు ప్రకటించారు. టీజేఎస్‌కు 8 సీట్లు ఇస్తామని కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

జనగాం మాదే: టీజేఎస్‌
కాంగ్రెస్‌ పార్టీతో జనగాం సీటుపై పంచాయతీ తేలకుండానే ఇక్కడి నుంచి తామే పోటీ చేస్తామని టీజేఎస్‌ ప్రకటించడం విశేషం. మరోవైపు జనగాం సీటు తనదేనని పొన్నాల లక్ష్మయ్య విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మకాం వేసి తన సీటును కాపాడుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగం‍గా టీడీపీకి వెళ్లిన మహబూబ్‌నగర్‌ స్థానంలోనూ పోటీ చేస్తామని టీజేఎస్‌ ప్రకటించడంతో మళ్లీ గందరగోళం రేగింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ బరిలోకి దిగుతామని ప్రకటించింది.

కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకేనా?
మహాకూటమిలో తమకు కేటాయించిన 8 స్థానాలకు మించి టీజేఎస్‌ అభ్యర్థులను ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌, మహబూబ్‌నగర్‌లో తాము బలంగా ఉన్నామని, కచ్చితంగా గెలుస్తామని టీజేఎస్‌ చెబుతోంది. ఇక్కడి అభ్యర్థులను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్‌, టీడీపీలను ఒప్పిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఎక్కడా స్నేహపూరక పోటీ ఉండదని చెబుతూనే, తాము మాత్రం వెనక్కు తగ్గబోమన్న సంకేతాలు ఇచ్చింది. కూటమిలో పట్టువిడుపులు ఉండాలని, తాము బలంగా ఉన్న సీట్లను మాత్రమే కోరుతున్నామని తెలిపింది. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో తమ పార్టీ అధ్యక్షుడు కోదండరాం జరుపుతున్న చర్చలు ఫలిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచింది. అయితే ఆశావహులను బుజ్జగించే ప్రయత్నంలోనే టీజేఎస్‌ ఈ ఎత్తుగడ వేసిందన్న వాదనలు లేకపోలేదు. మహాకూటమిలో కొనసాగుతామని టీజేఎస్‌ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు