కూల్చడానికి ముహూర్తాలు ఎందుకు?

6 Sep, 2018 04:36 IST|Sakshi

ఎన్నికలకు మేము సిద్ధమే

మీడియా చిట్‌చాట్‌లో కోదండరాం

25 నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెడీ

ప్రగతికి పది సూత్రాలు పేర టీజేఎస్‌ మేనిఫెస్టో

సాక్షి, హైదరాబాద్‌: ఏదైనా నిర్మాణం చేపట్టడానికి ముహూర్తం కావాలి తప్ప, ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏవరైనా ముహూర్తం చూస్తారా? అని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ పేర్కొన్నారు. కోదండరామ్‌ జన్మదినం సందర్భంగా టీజేఎస్‌ కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని, 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నారన్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నికల ప్రచార కమిటీలు పని చేస్తున్నాయని, ఇంటింటికి జన సమితి కార్యక్రమం కొనసాగుతోందన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం ఇతర కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత మరో 25 నియోజకవర్గాల్లో కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో నిరుద్యోగ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ వారిని, యోగేందర్‌ యాదవ్‌ లాంటి వారిని వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుంటామన్నారు. ప్రగతికి పది సూత్రాల పేరుతో జయశంకర్‌ మానవ వనరుల కేంద్రం టీజేఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తోందన్నారు. త్వరలోనే దానిని ప్రజల్లోకి తీసుకొస్తామన్నారు. జనం రాజకీయ మార్పును కోరుకుంటున్నారని, అది టీజేఎస్‌తోనే సాధ్యం అవుతుందని నమ్ముతున్నారన్నారు.  

గిట్టుబాటు ధరకు ప్రాధాన్యం..
మాదక ద్రవ్యాలను ఆపడం, నిరుద్యోగ భృతి, మహిళా సంఘాలకు రుణాలు తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. రుణమాఫీతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. నిరుద్యోగులకు భృతి అవసరమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీజేఎస్‌ పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం టీజేఏస్‌ను రాజకీయ పార్టీగా గుర్తించిందని, జాతీయ ఎన్నికల సంఘం గర్తించాల్సి ఉందని కోదండరామ్‌ వివరించారు. మరో పది రోజుల్లో ఆ గుర్తింపు వస్తుందని, ముందస్తు ఎన్నికలకు టీజేఎస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎన్నికల గుర్తుకోసం ఇప్పటికే ఈసీకి దరఖాస్తు చేశామని ఆయన అన్నారు. అయితే గుర్తు ఏదనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు.

పిల్లలకు ఒక పూట అన్నం పెట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులున్న రాష్ట్రంలో మనం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో మంచి పాలన జరిగిందని ఏ ఒక్కరితోనైనా పాలకులు అనిపించగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ మళ్లీ గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తారో.. చేయరో.. కూడా చూడాలన్నారు. కేసీఆర్‌ సభల పేరుతో జనాన్ని తరలిస్తే.. తాము జనం వద్దకే పోయి పలకరిస్తున్నామన్నారు. నియోజకవర్గాల్లో బలపడ్డాకే పొత్తుల విషయం మాట్లాడుతామని చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో 10 వేల మందితో సమావేశం పెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పైసలున్నోళ్లంతా ఓ పక్కన ఉంటే.. పైసలు లేనోళ్లంత ఓ పక్కన ఉంటారని టీజేఎస్‌ అధ్యక్షుడు వివరించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ నేతలు వెంకట్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, జోత్స్న తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు