లేఅవుట్ల అనుమతులకు సింగిల్‌ విండో వ్యవస్థ

12 Jan, 2020 02:05 IST|Sakshi

మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన టీజేఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి నియంత్రణలో భాగంగా పారదర్శక పాలనకు ఇళ్లు, లేఅవుట్ల అనుమతుల కోసం పటిష్ట సింగిల్‌ విండో వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) తన మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చింది. ఈ ఎన్నికల ప్రణాళికలో అవినీతిరహిత ఆదర్శ మున్సిపాలిటీల కోసం పౌరసంఘాలతో నిఘా వ్యవస్థ (అంబుడ్స్‌మన్‌) ఏర్పాటు, రాజకీయ, అధికార యంత్రాంగం పనితీరుపై అన్ని కార్యాలయాల్లో పనితీరు పట్టిక, వారానికోసారి ‘ఇంటింటికీ కౌన్సిలర్‌’కార్యక్రమం, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల తొలగింపు, ఉల్లం ఘనులపై చర్యలు, టీజేఎస్‌ కౌన్సిలర్లు ఆక్రమణలు, అవినీతికి పాల్పడిన పక్షంలో పార్టీ నుంచి సస్పెన్షన్‌ తదితర అంశాలను పొందుపరిచింది. శనివారం పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కోదండరాం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నేతలు గెలిస్తే సంపాదనే లక్ష్యంగా ఉంటారని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయినందున ప్రభుత్వం నిధులివ్వదని, మున్సిపాలిటీలను పనిచేయనివ్వరని, అక్రమార్జనకు మున్సిపాలిటీలను వాడుకుంటారని ఆరోపించారు. 
మేనిఫెస్టోలోని ఇతర ముఖ్యాంశాలు...

  • కాలుష్యరహిత పట్టణాల కోసం పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం
  • రక్షిత మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు
  • మురుగునీటి నిర్వహణ అమలు ద్వారా ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారణ
  • పట్టణాల్లో సులభ్‌ తరహాలో మరుగుదొడ్లు, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు
  • మున్సిపల్‌ స్కూళ్ల సమర్థ నిర్వహణ
  • నిధులు, విధులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో పౌర సంఘాలకు పాత్ర
  •  నాణ్యమైన సత్వరమైన వైద్య సదుపాయాలతో బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు
  •  పట్టణ పేదలకు గృహ వసతి, మురికి వాడలకు కనీస వసతులు

మరిన్ని వార్తలు